సాక్షి, హైదరాబాద్: దసరా పండుగ ఈ ఏడాది ఆటోమొబైల్ రంగాన్ని కొంతమేర నిరాశకు గురిచేసింది. గతేడాదితో పోలిస్తే అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ద్విచక్ర వాహన విక్రయాలు ఆశాజనకంగానే ఉన్నా కార్ల అమ్మకాలు తగ్గాయి. సాధారణంగా ప్రతి సంవత్సరం అమ్మకాలు పెరగాల్సి ఉండగా, అందుకు భిన్నంగా ఉన్నట్లు రవాణాశాఖ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏడాది పాటు అమ్మకాలు ఉన్నా, లేకున్నా అక్టోబర్‌పైనే ఆశలు పెంచుకొనే డీలర్లు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా మార్కెట్ కార్యకపాలు నెమ్మదించడం, హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోవడం వల్ల కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాల విక్రయాలు తగ్గినట్లు చెబుతున్నారు. గతేడాది కంటే ఈసారి 15 నుంచి 20 శాతం తగ్గుదల ఉన్నట్లు చెప్పారు. మరోవైపు ద్విచక్ర వాహనాల అమ్మకాలు బాగానే ఉన్నప్పటికీ గతేడాదితో పోలిస్తే పెద్దగా వ్యత్యాసం కనిపించడం లేదని పేర్కొంటున్నారు.
ఆదాయంలో బైక్‌లపైనే ఎక్కువ..
మొత్తంగా వాహనాల అమ్మకాలు తగ్గుముఖం పట్టినప్పటికీ జీవితకాలపన్ను రూపంలో ఆర్టీఏకు వచ్చే ఆదాయంలో బైక్‌లపైనే ఎక్కువగా వచ్చింది. కార్లపై దాదాపు స్థిరంగానే ఉంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతీయ రవాణా కార్యాలయాల పరిధిలో సుమారు 150 ఆటోమొబైల్ షోరూమ్‌లు ఉన్నాయి. వాటితో పాటు మరో 50కి పైగా అనుబంధ షోరూమ్‌లు ఉన్నాయి. సాధారణంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 10 ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ప్రతిరోజు 1500 నుంచి 2,000 వరకు కొత్త వాహనాలు నమోదవుతాయి. దసరా, దీపావళి వంటి పండుగ రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపు ఉంటుంది. కొత్త వాహనం కొనుగోలు చేయాలని భావించే ప్రతిఒక్కరూ దసరా రోజులను శుభప్రదంగా భావిస్తారు. మరోవైపు దసరా సందర్భంగా ప్రకటించే ఆఫర్లు కూడా వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటాయి. కానీ ఈసారి కార్లపైన గరిష్టంగా రూ.లక్ష వరకు తగ్గింపు ఇచ్చినా ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేవని పలువురు డీలర్లు అన్నారు.
బైక్ ఓకే..
బైక్‌ల అమ్మకాలు మాత్రం గతేడాది కంటే పెరిగాయి. గత సంవత్సరం అక్టోబర్ 15వ తేదీ నుంచి 24 వరకు 32,306 ద్విచక్ర వాహనాలను విక్రయించగా, ఈ అక్టోబర్ 3వ తేదీ నుంచి 13 వరకు 35,475 బైక్‌లు అమ్ముడయ్యాయి. సుమారు 3,169 ద్విచక్రవాహనాలను అదనంగా విక్రయించారు. ‘ఆటోమొబైల్ రంగానికి దసరా లైఫ్ వంటిది. అలాంటి దసరా ఈ సారి తీవ్రంగా నిరాశపర్చింద’ని తెలంగాణ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్‌కోటేశ్వర్‌రావు చెప్పారు.
చదవండి: ఓలాపై ఫిర్యాదుల వెల్లువ.. తగ్గుతున్న ఈవీల విక్రయాలు..
ఆటోమొబైల్‌పై ప్రభావం
ఆటోమొబైల్‌పై కూడా ఈ ప్రభావం ఈసారి స్పష్టంగా ఉంది. గత సంవత్సరం దసరా సందర్భంగా 10 రోజుల్లో 10,878 కార్ల అమ్మకాలు జరిగాయి. ఈ సంవత్సరం అదే కాలానికి 10,139 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఏటేటా రెట్టింపు చొప్పున పెరగాల్సిన అమ్మకాలు ఈసారి తగ్గుముఖం పట్టాయి. పైగా ఒకేసారి స్టాక్ తెచ్చి పెట్టుకోవడం వల్ల నష్టంగానే భావిస్తున్నాం’ అని సికింద్రాబాద్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ షోరూమ్ డీలర్ ఒకరు అభిప్రాయపడ్డారు. ఈ వాహనాల్లోనూ చాలా వరకు రూ.20 లక్షలలోపు వాహనాలే ఎక్కువ. హైఎండ్ కేటగిరికి చెందినవి తక్కువే. వివిధ రకాల బ్రాండ్‌లకు చెందిన కార్లపైన రూ.40 వేల నుంచి రూ.70 వేల వరకు ప్రోత్సాహకాలను ఇచ్చారు. గరిష్టంగా కొన్నింటిపైన రూ.లక్ష వరకు రాయితీ లభించింది. అలాగే రెండేళ్ల బీమా డబ్బులను కూడా డీలర్లే భరించారు. అయినప్పటికీ అమ్మకాలు పెరగలేదు.
Comments
Please login to add a commentAdd a comment