(ఫైల్ ఫోటో)
కరోనా మహమ్మారి గృహ కొనుగోలుదారుల అభిరుచిని మార్చేసింది. ఏటేటా అందుబాటు గృహాలపై ఆసక్తి తగ్గి.. ప్రీమియం ఇళ్లను కొనుగోలు చేయాలనుకునే వారి సంఖ్య పెరుగుతుంది. గతేడాది 36 శాతం మంది అఫర్డబుల్ హౌసింగ్ కొనుగోలుకు ఆసక్తిని కనబర్చగా.. ఇప్పుడది 27 శాతానికి క్షీణించింది. 34 శాతం మంది రూ.90 లక్షల నుంచి రూ.2.5 కోట్ల మధ్య ధర ఉండే ఇళ్లను కొనాలని భావించారు. గతేడాది హెచ్2లో సర్వేతో పోలిస్తే ఇది 10 శాతం వృద్ధి అని సీఐఐ–అనరాక్ కన్జ్యూమర్ సర్వే వెల్లడించింది.
సాక్షి, హైదరాబాద్: గృహ కొనుగోలుదారుల అభిరుచులపై కరోనా మహమ్మారి ఎంత మేర ప్రభావం చూపించిందో అంచనా వేసేందుకు ఈ సర్వేను నిర్వహించాయి. జనవరి–జూన్ మధ్య కాలంలో సుమారు 4,965 మందితో ఆన్‌లైన్‌లో సర్వే చేపట్టారు. తొలిసారిగా హోమ్ బయ్యర్లు రూ.45 లక్షల కంటే తక్కువ ధర ఉండే అఫర్డబుల్ హౌసింగ్స్ పట్ల విముఖత వ్యక్తం చేశారు. 35 శాతం మంది రూ.45–90 లక్షలు, 34 శాతం మంది రూ.90 లక్షల నుంచి రూ.2.5 కోట్ల మధ్య ధర ఉండే గృహాల కొనుగోళ్లకు ఆసక్తిని కనబరిచారు.
వాకింగ్ ట్రాక్, గ్రీనరీలే అధిక ప్రాధాన్యత..
గృహ కొనుగోలు ఎంపికలో తొలి ప్రాధాన్యం ఆకర్షణీయమైన ధర కాగా.. 77 శాతం మంది రెండవ ప్రియారిటీ డెవలపర్ విశ్వసనీయత. ఆ తర్వాతే ప్రాజెక్ట్ డిజైన్, లొకేషన్ ఎంపికల ప్రాథమ్యాలుగా ఉన్నాయి. కరోనా తర్వాత అందరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. దీంతో 72 శాతం మంది కస్టమర్లు ఇంటిని ఎంపిక చేసేముందు ప్రాజెక్ట్‌లో వాకింగ్ ట్రాక్స్ ఉండాలని, 68 శాతం మంది గ్రీనరీ ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నారు. స్విమ్మింగ్ పూల్ వసతులపై పెద్దగా ఆసక్తిని కనబర్చలేదు. 64 శాతం మంది ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసే సమయంలో ఆఫర్లు, రాయితీల కోసం వెతికారు.
60 శాతానికి పెరిగిన ఆన్‌లైన్..
ప్రాపర్టీలను వెతకడం నుంచి మొదలుపెడితే డాక్యుమెంటేషన్, న్యాయ సలహా, చెల్లింపుల వరకు ప్రతీ దశలోనూ కొనుగోలుదారులు డిజిటల్ మాధ్యమాన్ని వినియోగిస్తున్నారు. కరోనా కంటే ముందు ప్రాపర్టీ కొనుగోలు ప్రక్రియలో ఆన్‌లైన్ వాటా 39 శాతంగా ఉండగా.. ఇప్పుడది 60 శాతానికి పెరిగింది. పటిష్టమైన ఆన్‌లైన్ మార్కెటింగ్ బృందం, సోషల్ మీడియా వేదికలు ఉన్న డెవలపర్లు మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో నిలబడగలుగుతారు.
కరోనా ఫస్ట్ వర్సెస్ సెకండ్ వేవ్
- కరోనా ఫస్ట్ వేవ్‌లో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిదారులు విశ్వాసం 48 శాతంగా ఉండగా.. సెకండ్ వేవ్ నాటికి 58 శాతానికి పెరిగింది.
- గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో కొనుగోళ్లకు 32 శాతం మంది ఆసక్తిని చూపించగా.. ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే ఇది 14 శాతం క్షీణత. బ్రాండెడ్ డెవలపర్ల ప్రాజెక్ట్‌లలో కొనేందుకు కస్టమర్లు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
- సెకండ్ వేవ్‌లో 71 శాతం మంది తాము ఉండేందుకు ఇంటిని కొనుగోలు చేయాలని భావించగా.. 29 శాతం మంది పెట్టుబడి కోసం ఎంపిక చేశారు. ఇదే ఫస్ట్ వేవ్‌లో అయితే 41 శాతం ఇన్వెస్టర్లే ఉన్నారు. కరోనా నేపథ్యంలో పచ్చదనం, ఆరోగ్యంపై ఆసక్తి పెరగడంతో సెకండ్ హోమ్ డిమాండ్‌కు కారణం కావచ్చు.
ప్రవాసులు కొనేది ఆ నగరాలో
బెంగళూరు, పుణే, చెన్నై నగరాల్లోని రూ.1.5–2.5 కోట్ల మధ్య ధర ఉండే గృహాలను కొనుగోలు చేసేందుకు ప్రవాసులు ఆసక్తి చూపిస్తుండగా.. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో అయితే చండీగఢ్, కోచి, సూరత్ వంటి పట్టణాలపై మక్కువ చూపిస్తున్నారు. 41 శాతం మంది రెండో ఇంటిని తాము ఉండేందుకు కొనుగోలు చేస్తుండగా.. 53 శాతం మంది ఎత్తయిన ప్రాంతాలలో ఇళ్ల కోసం వెతుకుతున్నారు. 65 శాతం మంది వర్క్ ఫ్రంహోమ్, ఆన్‌లైన్ క్లాస్‌ల నేపథ్యంలో పెద్ద సైజు ఇళ్లపై మక్కువ చూపిస్తుంటే.. 68 శాతం మంది శివారు ప్రాంతాలలో కొనుగోళ్లకు ఇష్టపడుతున్నారు.
ఎందుకు వద్దంటే? – అనూజ్ పురీ, చైర్మన్, అనరాక్
రూ.45 లక్షలు, అంతకంటే తక్కువ ధర ఉండే అఫర్డబుల్ హౌసింగ్ కొనుగోళ్లకు కస్టమర్లు అనాసక్తిగా ఉండటానికి ప్రధాన కారణం ఆ విభాగం కొనుగోలుదారుల ఆర్థిక పరిస్థితులపై కరోనా ప్రభావం చూపించడమే. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావటం, అన్ని రంగాలలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవటం, ఉద్యోగ భర్తీలు పెరిగితే అందుబాటు గృహాలకు మళ్లీ గిరాకీ పెరుగుతుంది.
చదవండి : రియల్టీ పెట్టుబడులు అప్
Comments
Please login to add a commentAdd a comment