న్యూయార్క్: అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడాయిల్ ధర తిరిగి 100 డాలర్ల పైకి చేరకోవడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో వారాంతపు రోజున బలహీనతలు నెలకొన్నాయి. మరోవైపు ఉక్రెయిన్–రష్యాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ యుద్ధం మాత్రం ఆగకపోవడం మరింత ఒత్తిడిని పెంచుతోంది. అమెరికాతో నెలకొన్న వాణిజ్య వివాదాలతో పాటు ఉక్రెయిన్‌పై రష్యా కొనసాగిస్తున్న పోరుపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ శుక్రవారం ఫోన్లో మాట్లాడతారని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ పరిణామాల దృష్ట్యా ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తున్నారు. ఆసియా మార్కెట్లలో జపాన్, చైనా, సింగపూర్ సూచీలు అరశాతం నుంచి ఒకశాతం వరకు లాభపడ్డాయి. ఇండోనేసియా, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్ సూచీలు ఒకశాతం నుంచి అరశాతం నష్టాలను చవిచూశాయి. యూరప్ మార్కెట్లు ఒకశాతం క్షీణించాయి. అమెరికా మార్కెట్లు ఆరశాతం నష్టంతో మొదలయ్యాయి.
బీఓజే వడ్డీరేట్లు యథాతథం
బ్యాంక్ ఆఫ్ జపాన్(బీఓజే) కీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగా ఉంచింది. రెండు రోజుల పాటు ద్రవ్య సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన కమిటీ శుక్రవారం నిర్ణయాలను వెల్లడించింది. ‘‘ద్రవ్య పరపతి విధానంలో ఎలాంటి మార్పులు చేపట్టడం లేదు. ఆర్థిక వృద్ధి పుంజుకునే చర్యల్లో భాగంగా కీలక వడ్డీరేట్లను మైనస్ 0.1 శాతంగానే కొనసాగిస్తూ.., వ్యవస్థలోకి పది బిలియన్ల డాలర్ల లిక్విటిడీని పంపిణీ చేస్తాము’’ అని తెలిపింది.
నికాయ్, షాంఘైలు ప్లస్ .., హాంగ్‌సెంగ్, కోప్సీలు మైనస్
బ్యాంక్ ఆఫ్ జపాన్(బీఓజే) కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడంతో జపాన్ ఇండెక్స్ నికాయ్ అరశాతానికి పైగా లాభపడి 26,827 వద్ద స్థిరపడింది. ఆర్థిక పరిపుష్టికి చర్యలను చేపడతామని విధాన నిర్ణేతల హామీతో చైనా స్టాక్ మార్కెట్ వరుసగా మూడోరోజూ బలపడింది. ఆ దేశ ప్రధాన స్టాక్ సూచీ షాంఘై కాంపోసైట్ ఒకశాతానికి పైగా పెరిగి 3,251.07 వద్ద స్థిరపడింది. రెండు రోజుల పాటు భారీగా ర్యాలీ చేసిన హాంగ్‌కాంగ్ మార్కెట్లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. హాంగ్‌సెంగ్ సూచీ ఆరశాతం క్షీణించి 21,412 వద్ద నిలిచింది. తాజాగా కోవిడ్ కేసుల పెరుగుదల భయాలతో ఆసియాలోని ఇండోనేషియా, దక్షిణ కొరియా, థాయిలాండ్ సూచీలు ఒకశాతం నుంచి అరశాతం నష్టాలను చవిచూశాయి.
ఒక శాతం పతనమైన యూరప్ మార్కెట్లు
జర్మనీ చెందిన డాక్స్ ఇండెక్స్ ఒకశాతం క్షీణించి 14,267 వద్ద ముగిసింది. ఫ్రాన్స్ స్టాక్ సూచీ సీఏసీ 0.80% పతనమైన 6,570 వద్ద స్థిరపడింది. బ్రిటన్ ఇండెక్స్ ఎఫ్‌టీఎస్‌ఈ 100 అరశాతం నష్టపోయి 7,367 వద్ద ట్రేడ్ అవుతోంది.
నష్టాలతో మొదలు అమెరికా మార్కెట్లు
3 రోజుల వరుస లాభాలకు ముగింపు పలుకుతూ అమెరికా మార్కెట్లు శుక్రవారం నష్టాలతో మొదలయ్యాయి. డోజోన్స్, ఎస్‌అండ్‌పీ 500, నాస్‌డాక్ సూచీలు అరశాతానికి పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఫెడ్ వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలో గత 3 రోజులుగా ఈ సూచీలు లాభాలతో ముగిశాయి.
Comments
Please login to add a commentAdd a comment