న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనం చూస్తున్న తరుణంలో, దేశీ వినియోగమే భారత్ ఆర్థిక వ్యవస్థకు సహజ ప్రేరణగా నిలుస్తోందని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా అభిప్రాయపడ్డారు. భారత్ జీడీపీ అధిక శాతం దేశీయ డిమాండ్‌పైనే ఆధారపడి ఉన్నట్టు చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో అజయ్ బంగా బుధవారం సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జీ20కి సంబంధించిన అంశాలు, ప్రపంచబ్యాంక్, భారత్ మధ్య సహకారంపై ఆర్థిక మంత్రితో చర్చించినట్టు చెప్పారు.
‘‘జీ20లో ఏం చేశామన్నది, అలాగే సమావేశం ఎలా కొనసాగిందన్నది మాట్లాడుకున్నాం. జీ20లో భాగంగా ప్రపంచబ్యాంక్, భారత్ ఇంకా ఏం చేయగలవన్నదీ చర్చించాం. ప్రపంచబ్యాంక్‌కు పోర్ట్‌ఫోలియో పరంగా భారత్ అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ఈ మార్కెట్‌పై ఎంతో ఆసక్తి నెలకొంది’’అని బంగా వివరించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పనితీరుపై మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఆరంభంలో మరింత క్షీణించేందుకు రిస్క్‌లు ఉన్నట్టు చెప్పారు.
‘‘భారత్ జీడీపీలో అధిక భాగం దేశీయ వినియోగం నుంచే సమకూరుతోంది. కనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరికొన్ని నెలల పాటు నిదానించినా, దేశీ వినియోగంతో భారత్ బలంగా నిలబడుతుంది’’అని బంగా పేర్కొన్నారు. జీ20 సమావేశంలో పాల్గొనేందుకు గాను భారత సంతతికి చెందిన అజయ్ బంగా ఇక్కడకు విచ్చేశారు. గత నెలలోనే ఆయన ప్రపంచబ్యాంక్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. అనంతరం భారత్ పర్యటనకు తొలిసారి విచ్చేశారు. విజ్ఞానం, టెక్నాలజీ అంతరాలను తగ్గించడమనేది భవిష్యత్ ఆర్థిక వృద్ధికి కీలకమని ఆర్థిక మంత్రి సీతారామన్ అన్నట్టు బంగా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment