న్యూఢిల్లీ: లాటిన్ అమెరికా, ఆఫ్రికా మార్కెట్ల ఊతంతో ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ప్యాసింజర్ వాహనాల ఎగుమతులు 26 శాతం ఎగిశాయి. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 1,27,083 యూనిట్లతో పోలిస్తే 1,60,263 యూనిట్లకు పెరిగాయి.
దేశీ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్యాసింజర్ కార్ల ఎగుమతులు 88 శాతం పెరిగి 1,04,400 యూనిట్లుగాను, యుటిలిటీ వాహనాలు 18 శాతం పెరిగి 55,547 యూనిట్లుగాను నమోదయ్యాయి. వ్యాన్‌ల ఎగుమతులు 588 యూనిట్ల నుంచి 316 యూనిట్లకు తగ్గాయి.
‘లాటిన్ అమెరికా, ఆఫ్రికా మార్కెట్లు కోలుకుంటున్న కొద్దీ ఆయా ప్రాంతాల్లో, మన ప్యాసింజర్ వాహనాల విక్రయాలు పెరుగుతున్నాయి‘ అని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ తెలిపారు. ప్రపంచ స్థాయి నాణ్యతతో భారతీయ ఉత్పత్తులు తక్కువ ధరకు లభిస్తుండటం, ఆయా దేశాల ప్రమాణాలకు అనుగుణంగా ఉండటం తదితర అంశాలు ఇందుకు దోహదపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
మారుతీ టాప్..
తొలి త్రైమాసికంలో 68,987 ప్యాసింజర్ వాహనాలను (53 శాతం అధికం) ఎగుమతి చేసి మారుతీ సుజుకీ అగ్రస్థానంలో నిల్చింది. ఎక్కువగా లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలకు ఎగుమతి చేసింది. బాలెనో, డిజైర్, స్విఫ్ట్, ఎస్–ప్రెసో, బ్రెజా మోడల్స్ టాప్‌లో ఉన్నాయి. ఇక హ్యుందాయ్ మోటర్ ఇండియా ఎగుమతులు 34,520 యూనిట్లుగా (15 శాతం వృద్ధి) నమోదయ్యాయి. కియా ఇండియా 21,459 వాహనాలను (గత క్యూ1లో 12,448) ఎగుమతి చేసింది. నిస్సాన్ మోటర్ ఇండియా 11,419 యూనిట్లు, ఫోక్స్‌వ్యాగన్ 7,146 యూనిట్లు, రెనో 6,658 వాహనాలు, హోండా కార్స్ 6,533 యూనిట్లను ఎగుమతి చేశాయి.
వాహన రంగంలో కోటి ఉద్యోగాలు
దేశీ ఆటోమొబైల్ రంగంలో వచ్చే 5–6 ఏళ్లలో యువతకు 1 కోటి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పరిశ్రమకు సంబంధించి 40 శాతం పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు దేశీయంగానే జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఆటోమొబైల్ రంగానికి భారత్ కీలక కేంద్రంగా మారనుంది. – రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర మంత్రి
Comments
Please login to add a commentAdd a comment