
ముంబై: బ్యాంక్ డిపాజిట్ రేట్లు మరింత పెరుగుతాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)లో బ్యాంక్ రుణాల్లో 13 శాతం వృద్ధి నమోదవుతుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనా వేసింది. గత అంచనా 10 శాతాన్ని పెంచింది. ‘‘ఆగస్ట్ 26 నాటికి బ్యాకింగ్ వ్యవస్థలో రుణ వృద్ధి 15.5 శాతంగా ఉంది. డిపాజిట్లలో వృద్ధి 9.5 శాతంగా ఉంది. రుణ డిమాండ్‌ను అందుకునేందుకు బ్యాంక్‌లు మరిన్ని డిపాజిట్ల సమీకరణకు ప్రయత్నిస్తాయి.
దీంతో రుణదాతల మధ్య డిపాజిట్ల కోసం పోటీ పెరగనుంది. డిపాజిట్ల వృద్ధి కంటే రుణాల డిమాండ్ అధిగమించనుంది’’అని రేటింగ్ ఏజెన్సీ తన తాజా నివేదికలో వివరించింది. ప్రభుత్వరంగ బ్యాంక్‌లతో పోలిస్తే ప్రైవేటు బ్యాంక్‌లు మరిన్ని డిపాజిట్లను సమీకరిస్తాయని పేర్కొంది. బ్యాంకింగ్ రంగలో స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏ) 2023 మార్చి నాటికి 6.8 శాతానికి పెరుగుతాయని అంచనా వేసింది. 2021–22 నాటికి జీఎన్‌పీఏలు 6.1 శాతానికి తగ్గడాన్ని ప్రస్తావించింది. చిన్న వ్యాపార సంస్థల రుణ విభాగంలో ఒత్తిళ్లు ఉన్నట్టు తెలిపింది. వడ్డీ రేట్లు పెరుగుతున్నందున నికర వడ్డీ మార్జిన్లు కూడా మెరుగుపడతాయని పేర్కొంది.
చదవండి: క్రెడిట్,డెబిట్ కార్డులపై కీలక నిర్ణయం.. ఆర్బీఐ కొత్త రూల్!
Comments
Please login to add a commentAdd a comment