న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు ఏడేళ్లలో మొదటిసారి బేరల్‌కు 93 డాలర్లు చేరడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. బాధ్యతాయుత, సహేతుక ధరను భారత్ కోరుకుంటున్నట్లు రాజ్యసభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయమంత్రి రామేశ్వర్ తెలి పేర్కొన్నారు.
ఈ కమోడిటీ విషయంలో తీవ్ర ఒడిదుడుకులను నిరోధించాలని తాము చమురు ఉత్పత్తి దేశాలను కోరుతున్నట్లు తెలిపారు. దేశం తన చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతులపై ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. దేశీయ పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ చమురు రేట్లకు అనుగుణంగా ఉంటాయి. దీనికితోడు దేశంలో పన్నుల భారం తీవ్రంగా ఉండడం ద్రవ్యోల్బణంపై ఒత్తిడులను పెంచుతోంది. ‘‘ముడిచమురు ధరల అస్థిరతపై భారతదేశం తన తీవ్ర ఆందోళనలను ఒపెక్ (పెట్రోలియం ఎగుమతి దేశాల సంఘం), ఇతర అంతర్జాతీయ వేదికల చీఫ్‌ల దృష్టికి ద్వైపాక్షింగా తీసుకువెళుతోంది’’ అని తెలిపారు.
మరో ప్రశ్నకు చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి సమాధానం చెబుతూ, 2021 డిసెంబర్ 1వ తేదీన బేరల్‌కు అంతర్జాతీయంగా 71.32 డాలర్లు ఉంటే, జనవరి 31వ తేదీ నాటికి 18.09 డాలర్లు పెరిగి 89.41 డాలర్లకు చేరిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment