న్యూఢిల్లీ: చమురు ధరలు మళ్లీ బ్యారెల్‌కు 100 డాలర్లను దాటిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చమురు ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్) రోజువారీ 2 మిలియన్ బ్యారెళ్ల మేర చమురు ఉత్పత్తిని (అంతర్జాతీయ సరఫరాలో 2 శాతం) తగ్గించాలని తీసుకున్న నిర్ణయం ఇందుకు దారితీస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బ్రెంట్ బ్యారెల్ ధర 92 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అవుతోంది. ఒపెక్ తాజా నిర్ణయం నవంబర్ నుంచి అమల్లోకి రానుంది. దీంతో అప్పటికి ధరలు పెరిగిపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఒపెక్ నిర్ణయం మేరకు ఉత్పత్తిలో కోత 2023 డిసెంబర్ వరకు అమల్లో ఉండనుంది. ‘‘చమురు ధరల విషయంలో సానుకూల అంచనాలతో ఉన్నాం. శీతాకాలంలో గ్యాస్ నుంచి చమురుకు మళ్లడం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతుంది. ఓఈసీడీ వ్యూహాత్మక చమురు నిల్వల విడుదల ముగింపు, చమురు ఉత్పత్తికి కోత విధించడానికి అదనంగా, రష్యా చమురు దిగుమతులపై యూరప్ విధించిన నిషేధం డిసెంబర్ 5 నుంచి అమల్లోకి రానుంది.
దీంతో చమురు మార్కెట్ మరింత కఠినంగా మారనుంది’’అని యూబీఎస్‌కు చెందిన విశ్లేషకులు స్టానోవో, గోర్డాన్ అంచనా వ్యక్తం చేశారు. సాధారణంగా ఒపెక్ భేటీ ఆరు నెలలకు ఓసారి జరుగుతుంటుంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా అవసరమైతే అసాధారణ సమావేశాన్ని నిర్వహించే అవకాశం కూడా లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు.
విపరిణామాలు..
మరోవైపు బ్రెంట్ క్రూడ్ ధర ఇటీవలి 82 డాలర్ల కనిష్ట స్థాయి నుంచి 12 శాతం ఇప్పటికే పెరగడం గమనార్హం. ‘‘రోజువారీగా 2 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తికి కోత విధించాలన్న ఒపెక్ నిర్ణయం పలు ప్రతికూలతలకు దారితీస్తుంది. కొన్ని సభ్య దేశాలు ఈ లక్ష్యాలను చేరుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. అధిక ద్రవ్యోల్బణం కారణంగా జీవన వ్యయం పెరిగిపోయి ఇబ్బంది పడుతున్న వినియోగదారుడికి ఉపశమనం కల్పించాలన్న లక్ష్యంతో యూఎస్ ఉంది.
మరి ఒపెక్ నిర్ణయం అమలైతే ఈ లక్ష్యానికి విఘాతం కలుగుతుంది’’అని క్విల్టర్ చెవియొట్ ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్ జామీ మడాక్ వివరించారు. ఓపెక్ సభ్య దేశం రష్యా అయితే మరింత తక్కువ ఉత్పత్తి చేస్తున్నట్టు కొందరు అనలిస్టులు చెబుతున్నారు. 8 లక్షల బ్యారెళ్ల మేర నికర సరఫరా మార్కెట్లో తగ్గుతుందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ కమోడిటీస్ డైరెక్టర్ పాల్ హికిన్ అంచనా వేశారు. ఒపెక్ నిర్ణయం వచ్చే కొన్ని నెలలకు క్రూడ్‌కు బేస్ ధరను నిర్ణయించినట్టు చెప్పారు.
‘‘2020 మే నెలలో క్రూడ్ ధరలు మైనస్‌కు పడిపోయిన సమయంలో ఒపెక్ చమురు ఉత్పత్తికి భారీ కోత విధించింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఉత్పత్తికి కోత పెట్టాలని ఒపెక్ నిర్ణయించడం మళ్లీ ఇదే. ఇప్పుడు బ్రెండ్ బ్యారెల్ కనీసం 90 డాలర్ల కంటే తగ్గకుండా ఉండాలని (బేస్) ఒపెక్ ప్లస్ దేశాలు భావిస్తుండొచ్చు. ఆయిల్ మార్కెట్ కొత కాలంగా బేరిష్ ట్రెండ్‌లో ఉన్నాయి. అమెరికా వ్యూహత్మక చమురు నిల్వల విడుదల అక్టోబర్‌తో ముగిసిపోతుంది. చైనా లాక్‌డౌన్‌లు, మొత్తం మీద డిమాండ్‌పై ప్రభావం చూపిస్తాయి. అలాగే, రష్యాపై ఆంక్షలు కూడా చమురు ధరలను నిర్ణయిస్తుంది’’అని పాల్ హికిన్ అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment