
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీల నియంత్రణ కోసం వివిధ దేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. వీలైతే, జీ–20కి భారత్ అధ్యక్షత వహిస్తున్న ప్రస్తుత తరుణంలోనే ఇది కుదిరేలా చూసేందుకు ఆర్థిక స్థిరత్వ బోర్డు (ఎఫ్‌ఎస్‌బీ)తో కలిసి పని చేస్తోంది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం (డీఈఏ) కార్యదర్శి అజయ్ సేథ్ ఈ వివరాలు తెలిపారు. క్రిప్టో అసెట్స్‌పై అంతర్జాతీయ ద్రవ్య నిధి రూపొందించిన నివేదికపై జనవరి 15, 16 తేదీల్లో ఢిల్లీలో జరిగిన సమావేశంలో వర్ధమాన దేశాలు చర్చించుకున్నాయని సేథ్ చెప్పారు. ఫిబ్రవరి 23న బెంగళూరులో జరగబోయే జీ–20 ఆర్థిక మంత్రులు, సెంట్రల బ్యాంక్ గవర్నర్ల సమావేశం సందర్భంగా .. క్రిప్టో అసెట్స్ పాలసీపైనా ఏకాభిప్రాయ సాధనకు ఒక సెమినార్ జరగనున్నట్లు వివరించారు.
దీని కోసం చర్చాపత్రం రూపకల్పన జరుగుతోందని పేర్కొన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులను కట్టడి చేసే దిశగా క్రిప్టో అసెట్స్‌పై అన్ని దేశాలూ కలిసి అంతర్జాతీయంగా నియంత్రించేలా చూసేందుకు జీ–20 అధ్యక్షత సందర్భంగా భారత్ కృషి చేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే తెలిపారు. ఎటువంటి నియంత్రణలు లేని క్రిప్టో కరెన్సీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతూ ఇన్వెస్టర్లను నష్టాలపాలు చేస్తుండటం ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న సంగతి తెలిసిందే. 2021 నవంబర్‌లో 3 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న క్రిప్టోల మార్కెట్ వేల్యుయేషన్ 2023 జనవరి నాటికి 1 ట్రిలియన్ డాలర్ దిగువకు పడిపోయింది.