అమెజాన్‌తో వ్యాపారం చేసి జెఫ్ బేజోస్ ప్రపంచలోనే కుబేరుడయ్యాడు, రిలయన్స్‌తో ముఖేశ్ అంబానీ ఆసియాలోనే ధనవంతుడయ్యాడు. అయితే వీరిలా ఏ కంపెనీ స్థాపించలేదు, ఏ కొత్త ఉత్పత్తిని మార్కెట్‌లోకి తీసుకురాలేదు. కానీ మార్కెట్‌తోనే ఆడుకున్నాడు. లాభాలు తెచ్చే కంపెనీల వాటాలను వేటాడాడు... వేల కోట్ల రూపాయలకు కూడబెట్టాడు. అతనే రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా. ఈ రోజు రాకేశ్ 61వ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం.
వెబ్‌డెస్క్: రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా స్టాక్ మార్కెట్ గురించి కాసింత అవగాహన ఉన్నవారికైనా పరిచయం అక్కర్లేని పేరు. సొంత కంపెనీ అంటూ లేకుండా కేవలం వాటాదారుడిగా ఉంటూ వేల కోట్ల రూపాయలు సంపద పోగేసిన ఘనాపాఠీ. అది కూడా కేవలం 36 ఏళ్లలోనే 34 వేల కోట్లు సంపాదించాడు. అంటే ఏడాదికి సుమారు 9,00 కోట్లకు పైగానే ఆర్జించాడు. అయితే ఆ ఆర్జన వెనుక అతని శ్రమ ఉంది. మేథస్సు ఉంది. భవిష్యత్తును అంచనా వేయగలిగే నేర్పు ఉంది. అవన్ని కలిపితేనే వేల కోట్ల ఆస్తులు.
పుట్టింది హైదరాబాద్‌లోనే
ఇండియన్ బిగ బుల్ , వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా జన్మించింది మన హైదరాబాద్‌లోనే. అయితే తండ్రి ట్యాక్స్ ఆఫీసర్ కావడంతో ఆ కుటుంబం ముంబైకి వెళ్లిపోయింది. తండ్రి నుంచి వచ్చిన వారసత్వంగా ఆయన చిన్నప్పటి నుంచి లెక్కలు ఒంటబట్టిచ్చుకున్నాడు. అందుకే చదువు పూర్తి కాకుండానే డిగ్రీలో ఉండగానే స్టాక్‌మార్కెట్‌పై కన్నేశాడు.
1986లో..
ఇప్పుడంటే బీఎస్‌ఈ సెన్సెక్స్ 50 వేల పాయింట్లు దాటింది. ఆరోజుల్లో అంటే 1985లో 150 పాయింట్ల దగ్గరే ఉండేది. అప్పటికి దేశంలో లైసెన్స్‌రాజ్ నడుస్తుండేది. ఏ పని చేయాలన్నా రెడ్ టేపిజం అడ్డొచ్చేది. అయినా సరే ఆ రోజుల్లోనే స్టాక్‌మార్కెట్ ట్రేడింగ్‌కి ఇండియాలో ఉన్న భవిష్యత్తును ఝున్‌ఝున్‌వాలా అంచనా వేయగలిగాడు.
ఐదు వేల పెట్టుబడితో
తండ్రి దగ్గర అరువుగా తీసుకున్న రూ. 5000లతో బాంబే స్టాక్ మార్కెట్‌లోకి ఎంటరయ్యాడు. ఏడాది పాటు ఇబ్బందులు పడ్డాడు. అయితే మార్కెట్‌పై ఒక అంచనా వచ్చింది. ఏ కంపెనీ షేర్లు ఎలా వర్కటవుతాయో తెలిసింది. ఈసారి గురి చూసి టాటా టీ షేర్లు ఒక్కొక్కటి రూ. 43 వంతున 5,000 షేర్లు 1986లో కొనేశాడు. మూడు నెలలు తిరిగే సరికి షేర్ వాల్యు అమాంతం రూ. 143కి పెరిగింది. అంటే మూడు నెలల్లలో ఐదు లక్షల రూపాయల లాభం. ఇక అక్కడి నుంచి రాకేశ్ స్టాక్‌మార్కెట్ బుల్‌గా మారాడు. 1986 నుంచి 89 మధ్య ఏకంగా రూ. 25 లక్షలు సంపాదించాడు.
హర్షద్ మెహతా షాక్‌తో
ఆర్థిక సంస్కరణలు అమలవుతున్న కాలంలోనే ఇండియన్ స్టాక్ మార్కెట్‌కి హర్షద్ మెహతా రూపంలో భారీ షాక్ తగిలింది. హర్షద్ మెహెతా ఎఫెక్ట్‌ని షేర్ మార్కెట్‌పై వెంటనే అంచనా వేసిన రాకేశ్ తన దగ్గరున్న షేర్లు సకాలంలో అమ్మి నష్టాలు తప్పించుకోగా... ఈ పరిణామం ముందుగా అంచనా వేయలేకపోయిన వారి సంపద ఆవిరైపోయింది. ఎంతో నేర్పుతో హర్షద్ ఎఫెక్ట్ నుంచి రాకేశ్ తప్పించుకోగలిగాడు.
టైటాన్‌దే!
రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా సంపదనలో అత్యధికం వాచీలు, వజ్రాలు తయారు చేసే టైటాన్ కంపెనీ నుంచే వచ్చింది. రాకేశ్ ఝున్‌ఝున్ వాటా సంపాదనలో ఒక్క టైటాన్ వాటాయే రూ.7,879 కోట్లు ఉండగా ఆ తర్వాత స్థానంలో టాటా మోటార్స్ రూ. 1,474, క్రిసిల్ రూ. 1,063 కోట్లుగా ఉన్నాయి. ఇప్పటికీ రాకేశ్ పోర్ట్‌పోలియోలో మొత్తం 37 కంపెనీలు ఉన్నాయి. ఇందులో ప్రధానమైనవిగా లుపిన్, ఫోర్టిస్ హెల్త్‌కేర్, నజరా టెక్నాలజీస్, ఫెడరల్ బ్యాంక్, డెల్టా కార్ప్, డీబీ రియల్టీ, టాటా టెలి కమ్యూనికేషన్స్ తదితర కంపెనీలు ఉన్నాయి.
రారే తోడుగా
బాంబే స్టాక్ ఎక్సేంజీలో 1987 నాటికి రాకేశ్ రాధేశ్యామ్ ఝున్‌ఝున్ వాలా నిలదొక్కకున్నాడు. ముంబైలో అంధేరీకి చెందిన మరో స్టాక్‌మార్కెట్ ఇన్వెస్టర్ రేఖాను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా రారే పేరుతో 2003లో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కంపెనీని నెలకొల్పారు. ప్రస్తుతం ఈ సంస్థ విజయవంతంగా రన్ అవుతోంది. అయితే 2016 ఫిబ్రవరి నుంచి సెప్టెంబరు మధ్య కాలంలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ ఆరోపణలపై రాకేశ్‌ను సెబీ ప్రశ్నించింది. మరోసారి 2020 జనవరిలో జరిగిన ట్రేడింగ్‌పైనా సెబీ విచారణ చేపట్టింది.
సినిమాల్లోనూ..
ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి వచ్చిన రాకేశ్ హంగామా డిజిటల్ మీడియా సంస్థను స్థాపించారు. ఇంగ్లీష్ వింగ్లీ్‌ష్, షమితాబ్ వంటి చిత్రాలకు సహా నిర్మాతగా వ్యవహరించారు. రాకేశ్ ఝున్‌ఝున్ వాలాపై సీక్రెట్ జర్నీ ఆఫ్ రాకేశ్‌ఝున్‌ఝున్‌వాలా అనే పుస్తకం వచ్చింది. అతని అభిమానులు వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియాగా పిలచుకుంటారు.
ఫ్యూచర్ ఉంది
కోవిడ్ ప్రభావంతో అన్ని రంగాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయితే స్టాక్ మార్కెట్ రంగంపై కోవిడ్ ప్రభావం పెద్దగా ఉండబోదనేది రాకేశ్ అభిప్రాయం. పెద్ద విపత్తులను తట్టుకునేలా ఇండియన్ ఎకానమీ ఉందనేది రాకేశ్ నమ్మకం.
Comments
Please login to add a commentAdd a comment