2024–25లో ఈ పరిశ్రమ విలువ రూ.23,100 కోట్లకు
గ్రాంట్ థాంటన్ భారత్ నివేదిక
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత గేమింగ్ పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20 శాతం వృద్ధితో రూ.23,100 కోట్లకు చేరుకుంటుందని గ్రాంట్ థాంటన్ భారత్, ఈ–గేమింగ్ ఫెడరేషన్ నివేదిక వెల్లడించింది. అయిదేళ్లలో ఈ రంగం దేశ, విదేశ ఇన్వెస్టర్ల నుంచి 2.8 బిలియన్ డాలర్ల నిధులను అందుకుందని వివరించింది.
పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం ఆన్‌లైన్ గేమర్స్ సంఖ్య దేశంలో 44.2 కోట్లకు చేరుకుందని తెలిపింది. సంఖ్య పరంగా చైనాను మించిపోయినట్టు వివరించింది. భారత్‌లోని డైనమిక్ గేమింగ్ పరిశ్రమ శక్తివంతమైన యువ జనాభా ద్వారా ఆజ్యం పోసిందని.. అపూర్వ వృద్ధికి సిద్ధంగా ఉందని నివేదిక పేర్కొంది. 2021–22లో సగటున ఒక్కో గేమర్ ప్రతి వారం ఎనమిదిన్నర గంటల సమయం వెచి్చంచారు.
ప్రధాన ఆదాయ వనరు..
రియల్ మనీ గేమింగ్ (ఆర్‌ఎంజీ) విభాగం పరిశ్రమలో ప్రధాన ఆదాయ వనరులలో ఒకటిగా అభివృద్ధి చెందుతోందని నివేదిక వివరించింది. ‘భారత్‌లోని ఆర్‌ఎంజీ రంగం 2023లో అనేక సవాళ్లను ఎదుర్కొంది. ప్రభుత్వం 28 శాతం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలు చేయడం ఈ రంగాన్ని గణనీయంగా ప్రభావితం చేసింది. పన్ను భారం కారణంగా కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు, కొన్ని స్టార్టప్‌లు మూసివేయడానికి దారితీసింది.
ఈ సవాళ్లు ఉన్నప్పటికీ గేమింగ్ పరిశ్రమ ఆదాయంలో ఆర్‌ఎంజీ రంగం 83–84 శాతం వాటాను కొనసాగిస్తోంది. ఈ విభాగంలో ప్రతిరోజూ డబ్బులు చెల్లించి ఆడుతున్న 9 కోట్ల మందితోసహా మొత్తం సుమారు 10 కోట్ల మంది ఆన్‌లైన్ గేమర్‌లు ఉన్నారు. ఈ స్థాయి గేమర్‌ల కారణంగా పరిశ్రమ విస్తరణ కొనసాగుతుంది. మొత్తం దీర్ఘకాలిక వృద్ధిపై పన్ను ప్రభావం పరిమితంగా ఉంటుంది. 28 శాతం జీఎస్టీ ప్రభావం తర్వాత కూడా పరిశ్రమలో పెట్టుబడిదారుల సెంటిమెంట్ బలంగా ఉంది. నమోదవుతున్న లావాదేవీలు ఆర్‌ఎంజీ విభాగం స్థిర వృద్ధిపై విశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయి’ అని నివేదిక తెలిపింది.
సమగ్ర ప్రవర్తనా నియమావళి..
ఈ–గేమింగ్ ఫెడరేషన్ సమగ్ర ప్రవర్తనా నియమావళిని ఈ సందర్భంగా విడుదల చేసింది. జవాబుదారీతనం, పారదర్శకతను నిర్ధారించడానికి నైతిక ప్రవర్తనకు స్పష్టమైన ప్రమాణాలను పొందుపరిచింది. సైబర్ బెదిరింపులు, నియంత్రణ అనిశి్చతులు, ఆర్థిక ప్రమాదాల వంటి కీలక ప్రమాదాలను ప్రవర్తనా నియమావళి పరిష్కరిస్తుందని గేమింగ్ ఫెడరేషన్ తెలిపింది. ఈ సవాళ్లను తగ్గించడానికి, పరిశ్రమ యొక్క స్థిరత్వం, వృద్ధిని నిర్ధారించడానికి ఉత్తమ అభ్యాసాలను అందిస్తుందని వివరించింది. స్వీయ–నియంత్రణను పెంపొందించడానికి, పరిశ్రమ ఉన్నతంగా ప్రమాణాలను నిర్వహించడానికి థర్డ్ పార్టీ ధృవీకరణ అవసరమని నివేదిక స్పష్టం చేసింది. సైబర్ బెదిరింపులు, మోసం, ఇతర అన్యాయమైన పద్ధతుల నుండి గేమర్స్‌ను రక్షించడానికి బలమైన నియంత్రణ యంత్రాంగాలు ఉండాలని అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment