న్యూఢిల్లీ: టాటా గ్రూప్ సంస్థ ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్‌సీఎల్) సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి పటిష్ట పనితీరు చూపించింది. లాభం మూడు రెట్లు పెరిగి రూ.583 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.179 కోట్లుగానే ఉంది.
విమానయాన, సంస్థాగత కేటరింగ్ సేవల విభాగం ‘తాజ్‌శాట్స్’ స్థిరీకరణతో ఏకీకృత ఆర్జన (రూ.307కోట్లు) తోడు కావడం లాభంలో అధిక వృద్ధికి దారితీసింది. ఆదాయం సైతం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే రూ.1,433 కోట్ల నుంచి రూ.1,826 కోట్లకు పెరిగింది. వ్యయాలు సైతం రూ.1,249 కోట్ల నుంచి రూ.1,502 కోట్లకు పెరిగాయి.
‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వీతీయ త్రైమాసికంలో డిమాండ్ బలంగా పుంజుకుంది. దీంతో ఆదాయం 28 శాతం పెరిగింది. హోటల్ విభాగంలో ఆదాయం 16 శాతం వృద్ధి చెందింది. దీంతో క్యూ2లో ఇప్పటి వరకు అత్యుత్తమ ఎబిట్డా మార్జిన్ 29.9 శాతం నమోదైంది’’అని ఐహెచ్‌సీఎల్ ఎండీ, సీఈవో పునీత్ ఛత్వాల్ తెలిపారు. 2024–25 సంవత్సరానికి రెండంకెల ఆదాయ వృద్ధి అంచనాలను కొనసాగిస్తున్నట్టు చెప్పారు. ఢిల్లీలోని ల్యాండ్‌మార్క్ హోటల్ ‘క్లారిడ్జ్’ను 2025 ఏప్రిల్‌లో స్వాధీనం చేసుకోనున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment