గ్యాస్ సిలిండర్ అయిపోయిందంటే దాదాపుగా ఇంటి పని సగం ఆగిపోతుంది. ఇంటిల్లిపాది మరో సిలిండర్ కోసం ఉరుకులు పరుగులు పెట్టాల్సి వస్తుంది. కానీ ఇకపై ఆ చింత అక్కర్లేదు. వేగంగా గ్యాస్ సిలిండర్ అందించేందుకు తత్కాల్ పథకం అందుబాటులోకి తెచ్చారు. అది కూడా పైటల్ ప్రాజెక్టుగా మన హైదరాబాద్‌లో తొలిసారిగా ఈ పథకం అమలుచేస్తున్నారు.
తత్కాల్ స్కీం
ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్ అయిపోతే గ్యాస్ ఏజెన్సీ వెళ్లడం, ఆన్‌లైన్ బుక్ చేయడం లేదా ఫోన్‌లో ఐవీఆర్‌ఎస్ పద్దతిలో ఇంకో సిలిండర్ బుక్ చేయాల్సి వచ్చేది. ఫుల్ సిలిండర్ ఇంటికి వచ్చేందుకు కనీసం ఆరు గంటల నుంచి ఆరు రోజుల వరకు సమయం పట్టేది. సామాన్యులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలను తీర్చేందుకు తత్కాల్ స్కీమ్ అమలు చేయాలని గ్యాస్ ఏజెన్సీలు నిర్ణయించాయి.
ముందుగా ఇంధన్
దేశం మొత్తం మీద 28 కోట్ల డొమెస్టిక్ గ్యాస్ కనెక‌్షన్లు ఉంటే అందులో 14 కోట్ల కనెక‌్షన్లు ఇండియన్ ఆయిల్ పరిధిలో ఉన్నాయి. దీంతో తత్కాల్ స్కీమ్‌ను ముందుగా ఇండియన్ ఆయిల్ పరిధిలో ఉన్న ఇంధన్ సిలిండర్లకు అమలు చేయనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ నగరాన్ని ఎంపకి చేశారు. ముందుగా జీహెచ్‌ఎంసీ పరిధిలో సికింద్రాబాద్ డివిజన్‌లో ఈ పైలట్ ప్రాజెక్టు అమలు చేస్తున్నారు.
బుకింగ్ ఇలా
రెగ్యులర్‌గా గ్యాస్ బుక్ చేసే ఐవీఆర్‌ఎస్, ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్, ఇండియన్ ఆయిల్ వన్ యాప్‌లలో తత్కాల్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి తత్కాల్ పద్దతిలో సిలిండర్ బుక్ చేయగానే.. సదరు ఏజెన్సీకి వెంటనే పుష్ మెసేజ్ వెళ్లిపోతుంది. వారు అక్కడి నుంచి డెలివరీ బాయ్‌కి ఆ మెసేజ్‌ని చేరవేస్తారు. ఇలా నిమిషాల వ్యవధిలోనే ఆర్డర్ బుక్ అవుతుంది.. డెలివరీకి రంగం సిద్ధమవుతుంది.
అరగంటలో
సిలిండర్ బుక్ చేసిన తర్వాత 30 నిమిషాల నుంచి గరిష్టంగా 2 గంటలలోపు ఫుల్ సిలిండర్‌ను అందిస్తారు. అందుకు గాను గ్యాస్ సిలిండర్ ధరపై అదనంగా రూ.25 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ సర్వీసులను ప్రస్తుతం సింగిల్ సిలిండర్ ఉన్న ఇళ్లకే అమలు చేస్తున్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచి దేశవ్యాప్తంగా ప్రతీ జిల్లాలో ఒక్కో ప్రాంతంలో ఈ తత్కాల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. క్రమంగా దేశమంతటా, అందరు వినియోగదారులకు తత్కాల్ సేవలు అందివ్వనున్నారు.
చదవండి: రేషన్ షాపుల్లో మినీ ఎల్‌పీజీ సిలిండర్లు.. కేంద్రమంత్రి ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment