బ్రిటిష్ రాచరిక చరిత్రలో ఒక ప్రత్యేకమైన భాగాన్ని భారతీయ బిజినెస్ టైకూన్ సొంతం చేసుకున్నారు. బ్రిటిష్ రాణి దివంగత క్వీన్ ఎలిజబెత్ 2 ఉపయోగించిన రేంజ్ రోవర్ కారును పూనావాలా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ యోహాన్ పూనావాలా కొనుగోలు చేశారు. దివంగత రాణి ఉపయోగించిన అదే రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఈ కారు ఇప్పటికీ కలిగి ఉండటం విశేషం.
విశేషమైన చరిత్రను ఉన్న కారును సొంతం చేసుకున్నందుకు పూనావాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. అసలు రిజిస్ట్రేషన్ నంబర్‌ను అలాగే ఉంచడం అదనపు బోనస్ అని ఆయన పేర్కొన్నారు. "ఈ అద్భుతమైన ఆటోమోటివ్ చరిత్రను సంపాదించినందుకు నేను సంతోషిస్తున్నాను" అని పూనావాలా చెప్పినట్లు ఎకనామిక్స్ టైమ్స్ పేర్కొంది. “సాధారణంగా రాజ కుటుంబం ఆధీనం నుంచి వెళ్లిపోయిన తర్వాత కారు నంబర్ ప్లేట్ మారుతుంది. ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే.. దివంగత క్వీన్ ఉపయోగించిన అదే రిజిస్ట్రేషన్ నంబర్ OU16 XVHని ఇప్పటికీ కలిగి ఉంది. ఇది అదనపు బోనస్‌గా మారింది” అని ఆయన చెప్పారు.
ఐవరీ అప్హోల్స్టరీతో లోయిర్ బ్లూ పెయింట్ చేసిన 2016 రేంజ్ రోవర్ SDV8 ఆటోబయోగ్రఫీ LWB ఎడిషన్ కారు సుమారు 18,000 మైళ్లు తిరిగింది. బ్రామ్లీ ఆక్షనీర్స్ వెబ్‌సైట్‌లో ఈ కారు రిజర్వ్ ధర 224,850 పౌండ్లు (రూ. 2.25 కోట్లకు పైగా) ఉంది. అయితే ఈ వేలం ప్రక్రియ లేకుండానే పూనావాలా కారును ప్రైవేట్‌గా కొనుగోలు చేశారు.
కారు ప్రత్యేకతలివే..
ఈ రేంజ్ రోవర్ కారును ప్రత్యేకంగా రాణి ఉపయోగించేందుకు రూపొందించారు. రహస్య లైటింగ్, పోలీసు ఎమర్జెన్సీ లైటింగ్‌తో సహా ప్రత్యేకమైన మార్పులు ఇందులో ఉన్నాయి. రాణి కోసం చేసిన ఒక ముఖ్యమైన మార్పు ఏమిటంటే.. సులువుగా కారు ఎక్కేందుకు, దిగేందుకు వెనుక భాగంలో గ్రాబ్ హ్యాండిల్స్ జోడించడం. కారులో చేసిన అన్ని మార్పులను అలాగే ఉంచాలని భావిస్తున్నట్లు పూనావాలా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment