దేశంలో రేసింగ్ కోసం ప్రత్యేక ఇంధనాన్ని ఇండియన్ ఆయిల్ తయారు చేసింది. ఎఫ్‌ఐఎం ఆసియా రోడ్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ (ARRC) 2024 సీజన్ కోసం స్టోర్మ్ (STORM) పేరుతో తీసుకొచ్చిన ఈ ప్రత్యేక రేసింగ్ ఇంధనాన్ని కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఆవిష్కరించారు.
రేసింగ్ సర్క్యూట్‌లోని ప్రీమియం సూపర్‌బైక్‌ల కోసం ఈ హై-ఆక్టేన్ అల్టిమేట్ రేసింగ్ ఫ్యూయల్‌ను ఇండియన్‌ఆయిల్ ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది. ప్రపంచవ్యాప్తంగా జరిగే రేసింగ్ ఈవెంట్‌లలో ఛాంపియన్‌లకు ఇది ఇంధనంగా నిలుస్తుంది. పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ కార్యదర్శి పంకజ్ జైన్, ఇండియన్ ఆయిల్ చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య, డైరెక్టర్ (మార్కెటింగ్) సతీష్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ ఇండియన్ ఆయిల్ మొదటిసారిగా గుజరాత్ రిఫైనరీ నుంచి స్టోర్మ్ పేరుతో కేటగిరీ 2 రేస్ ఇంధనం ఉత్పత్తిని ప్రారంభించిందని తెలిపారు. ఈ రేస్ ఇంధనం, ఏవీ గ్యాస్ 100 LL, రిఫరెన్స్ ఫ్యూయెల్స్ మొదలైనవాటితో పాటు కఠినమైన అంతర్జాతీయ స్పెసిఫికేషన్‌లకు కట్టుబడి స్వీయ-సమృద్ధి దిశగా భారత్ ప్రయత్నానికి అనుగుణంగా ఉంటుందన్నారు.
పూర్తిగా భారత్‌లోనే ఉత్పత్తి అవుతున్న ‘స్టోర్మ్’ ఇంధన ఆవిష్కరణ.. స్వావలంబన స్ఫూర్తికి, 'మేక్ ఇన్ ఇండియా' మిషన్‌కు గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇండియన్ ఆయిల్ ఇప్పటికే XP100, XP95 వంటి అధిక-ఆక్టేన్ ఇంధనాలను, అలాగే రిఫరెన్స్ గ్యాసోలిన్, డీజిల్ వంటి అధిక ఖచ్చితత్వ సముచిత ఇంధనాలను, ఏవియేషన్ ఇంధనం ఏవీ గ్యాస్ 100 LLలను విక్రయిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment