ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టాలినా జార్జివాతో ఆర్థిక మంత్రి సీతారామన్
న్యూఢిల్లీ: దేశాభివృద్ధి, ఉపాధి కల్పనే కేంద్రం ముందున్న ప్రధాన లక్ష్యాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్ట చేశారు. ద్రవ్యోల్బణం దారికొస్తోందని, దీనిపై దీర్ఘకాలంపాటు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండబోదని కూడా ఈ సందర్భంగా విశ్లేషించారు. రికార్డు గరిష్ట స్థాయిల నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం దిగివస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. వృద్ధి, దేశ సంపద ఫలాలు అందరికీ సమానంగా అందేలా చర్యలు తీసుకోవడమే ప్రభుత్వం ముందున్న ప్రాధాన్యతా అంశంగా పేర్కొన్నారు.
రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీని కట్టడే లక్ష్యంగా మే నుంచి ఆర్‌బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు–రెపోను 1.4 శాతం (ప్రస్తుతం 5.4 శాతానికి పెరుగుదల) పెంచిన నేపథ్యంలో సీతారామన్ చేసిన వ్యాఖ్యలు గమనార్హం. రెపో రేటు పెంపునకు తక్షణం ఇక ముగింపు పడినట్లేనా అన్న సందేహాలకు ఆమె ప్రకటన తావిస్తోంది. ‘ఇండియా ఐడియాస్ సమ్మిట్’లో ఈ మేరకు ఆమె చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు...
► రిటైల్ ద్రవ్యోల్బణం కొద్ది నెలలుగా దిగివస్తోంది. దీనిని మనం నిర్వహించగలిగిన స్థాయికి తీసుకురాగలుగుతున్నాం. ఇప్పుడు ప్రధాన ప్రాధాన్యతలు ఉపాధి కల్పన, వృద్ధికి ఊపును అందించడం. (ఆర్‌బీఐ కఠిన పాలసీ విధానం, సరఫరాల సమస్య పరిష్కారానికి కేంద్రం చర్యల నేపథ్యంలో రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా రెండవనెల జూలైలోనూ తగ్గి 6.71 శాతానికి చేరింది. ఏప్రిల్‌లో 7.79 శాతం, మేలో 7.04 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో 7.01 శాతానికి దిగివచ్చింది. నిజానికి రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం లోపు ఉండాలి. అయితే ఏడు నెలలుగా 6 శాతం ఎగువనే కొనసాగుతున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.7 శాతంగా అంచనా వేయగా, వరుసగా 2,3,4 (2022 జూలై–మార్చి 2023) త్రైమాసికాల్లో 7.1 శాతం, 6.4శాతం, 5.8శాతాలుగా నమోదవుతాయని ఆర్‌బీఐ పాలసీ అంచనావేసింది. 2023– 24 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 5 శాతానికి ఇది దిగివస్తుందని భావించింది.
► అమెరికన్ సెంట్రల్ బ్యాంక్– ఫెడ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ దూకుడు రేట్ల పెంపు వైఖరి నుండి ఉద్భవిస్తున్న అస్థిరతను ఎదుర్కొనే విషయంలో రిజర్వ్ బ్యాంక్ తగిన చర్యలు తీసుకుంటుందని విశ్వసిస్తున్నాం. భారత్ ద్రవ్య విధానాన్ని పెద్ద అవాంతరాలు లేదా తీవ్ర ఒడిదుడుకులు లేకుండా నిర్వహించగలమన్న ఆర్‌బీఐ అధికారులు విశ్వసిస్తున్నారు.
► కోవిడ్–19 కాలంలో కేంద్రం ఆర్థిక నిర్వహణ పటిష్టంగా ఉంది. లక్ష్యంతో కూడిన ఆర్థిక విధానంతో భారత్ డబ్బును ముద్రించకుండా సవాళ్లతో కూడిన సమాయాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంది.
► రష్యా–ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఏర్పడిన ప్రపంచ ఇంధన సంక్షోభ వల్ల ముడి చమురు, సహజ వాయువు లభ్యతపై అనిశ్చితి కొనసాగుతోంది.
► చెల్లింపులకు సంబంధించి సాంకేతికతతో సహా అన్ని ఆర్థిక అంశాలకు సంబంధించి భారత్– అమెరికాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉంది. భారత్, అమెరికాలు కలిసి పని చేస్తే, మనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిమాణంలో 30 శాతానికి చేరుకుంటాం. రాబోయే 20 సంవత్సరాలలో ప్రపంచ జీడీపీలో 30 శాతం వాటాను అందిస్తాము. ఈ పరిస్థితి భారత్–అమెరిలను ప్రపంచ వృద్ధికి ఇంజిన్‌గా మారుస్తుంది.
► భారత్ డేటా డేటా గోప్యత, రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. కేంద్రం కొత్త డేటా గోప్యతా బిల్లును త్వరలో పార్లమెంటులో ప్రవేశపెడుతుంది.
► అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో భారత్ ఈ సంవత్సరం చివర్లో జీ–20 దేశాల అధ్యక్ష బాధ్యతల ను తీసుకోనుంది. డిసెంబర్ 1నుంచి 2023 న వంబర్ 30 వరకూ నిర్వహించే ఈ బాధ్యతల స మయంలో భారత్ ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాల సవాళ్ల పరిష్కారంపై దృష్టి పెడుతుంది.
ఐఎంఎఫ్ కోటా సమీక్ష సకాలంలో జరగాలి...
కాగా, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థలో కోటాల 16వ సాధారణ సమీక్ష (జీఆర్‌క్యూ) సకాలంలో ముగించాల్సిన అవసరం ఉందని ఆర్థికమంత్రి స్పష్టం చేశారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడానికి ఇది ఎంతో అవసరమని సీతారామన్ పేర్కొన్నారు. ఐఎంఎఫ్ కోటా వ్యవస్థ బహుళజాతి రుణ సంస్థలో దేశాల ఓటింగ్ షేర్‌కు సంబంధించిన అంశం.
ప్రస్తుతం ఐఎంఎఫ్‌లో భారతదేశ కోటా 2.75 శాతం. చైనా కోటా 6.4 శాతం కాగా, అమెరికా కోటా 17.43 శాతం. ఐఎంఎఫ్ తీర్మానం ప్రకారం, కోటాలకు సంబంధించి 16వ సాధారణ సమీక్ష 2023 డిసెంబర్ 15వ తేదీలోపు ముగియాలి. వర్థమాన దేశాల అభిప్రాయాలకు అధిక ప్రాధాన్యత లభించేలా కోటా షేర్లలో సర్దుబాటు జరగాలని, వాటి ఓటింగ్ హక్కులు పెరగాల్సిన అవసరం ఉందని భారత్ డిమాండ్ చేస్తోంది. జీ20 బాధ్యతలు స్వీకరించనున్న భారత్‌తో పలు అంశాలపై చర్చించడానికి దేశంలో పర్యటిస్తున్న ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టాలినా జార్జివాతో సమావేశం అనంతరం కోటా అంశంపై సీతారామన్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ ఏడాదే డిజిటల్ కరెన్సీ ఆవిష్కరణ
ఆర్‌బీఐ డిప్యుటీ గవర్నర్ రవిశంకర్ వెల్లడి
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ఈ ఏడాదే ‘పైలెట్ బేసిస్’తో ప్రారంభించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ టీ రబీ శంకర్ ప్రకటించారు. దీనివల్ల అంతర్జాతీయంగా వివిధ దేశాలతో ఆర్థిక లావాదేవీల మరింత సులభతరం అవుతాయని పేర్కొన్నారు. ఆయా అంశాలకు సంబంధించి సమయం, వ్యయం రెండూ తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు.
2022–23 కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూపాయికి సమానమైన డిజిటల్ కరెన్సీని ఆర్‌బీఐ విడుదల చేస్తుందని చెప్పారు. ‘‘జీ–20, అలాగే బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) వంటి సంస్థలతో ఇప్పుడు ఎదుర్కొంటున్న చెల్లింపుల సమస్యను పరిష్కరించడానికి సీబీడీసీ అంతర్జాతీయీకరణ చాలా కీలకమని మనం అర్థం చేసుకోవాలి’’ అని ఇండియా ఐడియాస్ సమ్మిట్‌లో టీ రబీ శంకర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment