
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి గతంలో పని గంటలపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. వాటిని వెనక్కి తీసుకోబోనని స్పష్టం చేశారు. అందరూ కష్టపడి పని చేయాలని సూచించారు. సీఎన్‌బీసీ గ్లోబల్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మీడియా ప్రతినిధులు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.
ప్రతి ఒక్కరూ వారంలో దాదాపు 70 గంటలపాటు పని చేయాలని నారాయణ మూర్తి గతంలో కామెంట్ చేశారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా చర్చ జరిగింది. తన అభిప్రాయాన్ని మార్చుకున్నారా అని తాజాగా అడిగిన ప్రశ్నలకు మూర్తి స్పందించారు. ‘నన్ను క్షమించండి. నేను నా అభిప్రాయాన్ని మార్చుకోలేదు. నా తుదిశ్యాస వరకు ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటాను. దేశానికి ప్రధానిగా ఉన్న నరేంద్రమోదీ వారంలో 100 గంటలపాటు పని చేస్తున్నారు. మనం కూడా కష్టపడి చేయడమే తనకు ఇచ్చే ప్రశంస. ఇది దేశ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది. పని చేయకుండా విశ్రాంతి తీసుకోవడంతో ఫలితం ఉండదు. వారంలో ఆరు రోజుల పని దినాలను ఐదు రోజులకు మార్చినప్పుడు తీవ్ర నిరాశ చెందాను. నా జీవితంలో చాలాకాలంపాటు రోజులో 14 గంటలు, వారంలో ఆరున్నర రోజులు పనిచేశాను. ఉదయం 6:30 గంటలకు కార్యాలయానికి చేరుకుని రాత్రి 8:40 గంటల వరకు పని చేసేవాడిని. కష్టపడి పనిచేసేతత్వం భారతీయ సంస్కృతిలో ఇమిడిపోయింది’ అని అన్నారు.
ఇదీ చదవండి: నెలలో 5.9 శాతం తగ్గిన ఇళ్ల ధరలు!
ప్రపంచంలోనే అధికారికంగా వారంలో అధిక పని గంటలున్న దేశాలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్: 52.6 గంటలు(సరాసరి)
గాంబియా: 50.8 గంటలు
భూటాన్: 50.7 గంటలు
లెసోతో: 49.8 గంటలు
కాంగో: 48.6 గంటలు
ఖతార్: 48 గంటలు
ఇండియా: 47.7 గంటలు
మౌరిటానియా: 47.5 గంటలు
లైబీరియా: 47.2 గంటలు
బంగ్లాదేశ్: 46.9 గంటలు
Comments
Please login to add a commentAdd a comment