ఫోటో క్రెడిట్స్: నాసా
స్కైలాబ్ ఈ పేరు ప్రస్తుతం 50 సంవత్సరాలు పైబడినవారికి గుర్తుండే ఉంటుంది. 1970 దశకం చివర్లో స్కైలాబ్ సృష్టించిన హడావుడి అంతా ఇంతా కాదు. నాసా ప్రయోగించిన అంతరిక్ష స్టేషన్ ఎప్పుడు భూమ్మీద పడిపోతుందో అంటూ కొన్ని దేశాలకి చెందిన ప్రజలు కొన్నాళ్లపాటు బిక్కు బిక్కుమంటూ కాలం గడిపారు. కొంతమందైతే ఇదే మనకు చివరిరోజు అని భావించి విచ్చలవిడిగా ఎంజాయ్ చేశారు. అదే నేపథ్యంలో స్కైలాబ్ మూవీతో యువ దర్శకుడు విశ్వక్ ఖండేరావు ముందుకువచ్చిన విషయం తెలిసిందే..అది రీల్ స్కైలాబ్ అయితే రియల్ స్కైలాబ్ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం...
రష్యాకు పోటీగా..!
1960-1970 మధ్యకాలంలో అమెరికా-రష్యా మధ్య స్పేస్‌ను జయించాలనే తీవ్రమైన పోటీ ఉండేది. స్పేస్ టెక్నాలజీలో రష్యా ఒక అడుగు ముందుకేసి 1971లో సెల్యూట్ వన్ అనే స్పేస్ స్టేషన్‌ను అంతరిక్షంలోకి పంపింది. ఈ స్పేస్ స్టేషన్ హక్కులు కేవలం రష్యాకు మాత్రమే ఉండేవి. వేరే ఇతర దేశాలకు లేవు. దీంతో అమెరికా కూడా ఎలాగైనా తమకు సొంత స్టేషన్ ఉండాలనే నిర్ణయానికి వచ్చింది. వాటితో బయోకెమికిల్ రిసెర్చ్, సూర్యుడిపై పరిశోధనలు అనేక ఇతర టెస్ట్‌లను చేయడానికి స్కైలాబ్ ఉపయోగించి చేయవచ్చునని అమెరికా భావించింది.
మిల్లీ మీటర్ సైజ్ శకలం కొంపముంచింది
1973 మే 14 రోజున సాట్రన్‌వీ అనే రాకెట్ ద్వారా స్కైలాబ్‌ను నాసా అంతరిక్షంలోకి పంపింది. ప్రయోగం లాంచ్ చేసిన సమయంలో నాసాకు చెడు సంఘటన ఎదురైంది. అదేంటంటే ఎర్త్ వాతావరణంలోని ఒక మిల్లీ మీటర్ సైజ్‌లో ఉండే ఒక శకలం స్కైలాబ్ స్పేస్ స్టేషన్‌ను ఢీ కొట్టింది. దీంతో స్కైలాబ్ హిట్ షేల్, సోలార్ ప్యానెల్ దెబ్బతింది. స్కైలాబ్ ఆర్బిట్‌లోకి చేరాక..స్పేస్ స్టేషన్ దెబ్బతిందని నాసా గుర్తించింది. తీవ్రమైన సౌరవేడి నుంచి స్కైలాబ్‌కు రక్షణ లేకుండా పోయింది. అదే నెలలో మే 25 రోజున స్కైలాబ్-2 మిషన్ ద్వారా ఆస్ట్రోనాట్స్ బృందాన్ని పంపింది. స్పేస్ స్టేషన్‌కు వెళ్లిన మొదటి సిబ్బంది ప్రత్యామ్నాయ హీట్ షేడ్‌ను ఏర్పాటుచేసి, సోలార్ ప్యానెల్‌ను సరిచేశారు.వ్యోమగాములు ఇక్కడ 28 రోజులు స్కైలాబ్ స్పేస్ స్టేషన్‌లో గడిపారు. తరువాతి స్కైలాబ్ -3 మిషన్ లో క్రూ 59 రోజులు ఉండగా, నవంబర్‌లో మరో సిబ్బంది 84 రోజులు స్కైలాబ్ స్టేషన్‌లో ఉన్నారు.
సమస్య అక్కడ మొదలైంది..!
స్కైలాబ్ స్పేస్‌స్టేషన్‌కు రెండు రకాల గైరోస్కోప్స్ ఉన్నాయి. మొదటిది కంట్రోల్ మూమెంట్. ఇది స్పేస్ స్టేషన్ మూవ్ చేయడానికి ఉపయోగపడుతోంది. రెండోది రేట్ గైరోస్కోప్. స్పేస్ స్టేషన్ ఏ రేట్‌తో కదులుతుందే అనే విషయాన్ని చెప్తుంది. వీటిలో కంట్రోల్ మూమెంట్ గైరోస్కోప్ పనిచేయడం ఆగిపోయింది. ఈ విషయాన్ని నాసా 1975లో గుర్తించింది. ఆ సమయంలో స్కైలాబ్ భూమి నుంచి 433 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. అయితే వాతావారణ సాంద్రత, గ్రావిటీ, ఆయా వస్తువు ద్రవ్యరాశి కారణంగా 430 కిమీ కక్ష్యలో తిరిగే ఏ వస్తువైనా కొద్దికొద్దిగా భూమిపైకి వచ్చే అవకాశం ఉంది. నాసా అంచనా ప్రకారం 1980 వరకు కక్ష్యలో ఉంటుందని భావించింది. ఇంకా స్కైలాబ్‌లో ఒక ఏడాదికి సరిపోయే పుడ్, ఆక్సిజన్ ఉన్నాయి. మరికొన్ని పరికరాలను యాడ్ చేసి మరో ఐదు సంవత్సరాల మేర స్కైలాబ్‌ను ఉంచాలని నాసా భావించగా...మెల్లమెల్లగా స్కైలాబ్ తన కక్ష్యను కోల్పోతూ వచ్చింది.
వెంటాడిన దురదృష్టం..!
ఎలాగైనా స్కైలాబ్‌ను తిరిగి యథాస్థానంలో ఉంచాలనుకున్న నాసా చర్యలకు సోలార్ ఫ్లేర్ అడ్డంకిగా మారింది. సోలార్ ఫ్లేర్స్‌తో వాతావరణంలో డెన్సిటీ పెరిగింది. దీంతో 1980లో వస్తోందనకున్న ఉపద్రవం 1979లో రానుందని నాసా గ్రహించింది. ఇక చేసేదేమి లేక స్కైలాబ్ భూమిపై పడనుందని అమెరికా అన్ని దేశాలను అప్రమత్తం చేసింది. ఎక్కడ పడుతుందనే విషయం ఎవరికీ తెలియదు.
లక్ష వరకు ప్రాణాలు పోయే అవకాశం..!
స్కైలాబ్ ఎక్కువ శాతం 1979లో జులై 10 నుంచి జులై 14లోపు సౌతాఫ్రికాకు వెయ్యి కిలోమీటర్ల సమీపంలో సముద్రంలో పడుతోందని నాసా అంచనా వేసింది. భారత కాలమాన ప్రకారం...1979 జులై 11 న రాత్రి భూమి వైపుగా రావడం మొదలుపెట్టింది. స్కైలాబ్ భూ వాతావరణంలోకి రాగనే వెయ్యి కిలోమీటర్ల విస్తీర్ణంలో పడే అవకాశం ఉందని నాసా తెలిపింది. సుమారు 2 వేల ముక్కలుగా స్కైలాబ్ భాగాలు విడిపోతాయని పేర్కొంది. స్కైలాబ్ ఒకవేళ జనవాసాల మీద పడితే లక్షకు పైగా మరణాలు సంభవించే అవకాశం ఉందని నాసా హెచ్చరించింది. అది కాస్త 5000కిలోమీటర్ల విస్తీర్ణంలో హిందూ మహాసముద్రంలో పడగా..మిగతావి వెస్ట్రన్ ఆస్ట్రేలియా పడ్డాయి. ఆస్ట్రేలియాలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఒక్కసారిగా ప్రపంచదేశాలు ఊపిరిపిల్చుకున్నాయి. మిల్లీమీటర్ సైజులో ఉన్న ఒక చిన్న అంతరిక్ష శకలం..స్కైలాబ్‌కు తాకడంతో భారీ ప్రమాదాన్నే కొనితెచ్చింది. అప్పటినుంచి నాసా అంతరిక్ష ప్రయోగాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
స్కైలాబ్ కనిపెట్టినవి..!
- ఆ సమయంలో అంత ఎత్తున వ్యోమగాములు మరమ్మతులు చేయడం అదే తొలిసారి.
- సౌర తుఫాన్‌కు సంబంధించిన విషయాలను స్కైలాబ్ అందించింది.
- స్పేస్‌లో మానవుడు ఎలా ఉండాలో తదితర విషయాలు మొదటిసారిగా శాస్త్రవేత్తలు గుర్తించారు.
- లో గ్రావిటీ వంటి విషయాలను కూడా తెలుసుకోవడంలో ఉపయోగపడింది.
Comments
Please login to add a commentAdd a comment