Isha Ambani at Reliance AGM 2023: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిటైల్ విభాగం రిలయన్స్ రిటైల్ వ్యాపారం, పెట్టుబడులు.. ఇలా అన్ని అంశాల్లోనూ దూసుకెళ్తోంది. ముఖేష్ అంబానీ తనయ ఇషా అంబానీ నాయకత్వంలో రిటైల్ బిజినెస్ పరుగులు పెడుతోంది. తాజాగా జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ రిటైల్ ప్రగతిని ఇషా అంబానీ వివరించారు.
రిలయన్స్ రిటైల్ 2023 ఆర్థిక సంవత్సరంలో 100 కోట్ల లావాదేవీల మైలురాయిని దాటింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇది 42 శాతం పెరిగింది. సంస్థ రిజిస్టర్డ్ కస్టమర్ బేస్ 249 మిలియన్లకు చేరుకుంది. 3,300 కొత్త స్టోర్‌లు ఏర్పాటయ్యాయి. మొత్తంగా 65.6 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో 18,040 స్టోర్‌లకు రిటైల్ విస్తరణ చేరుకుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఎండీ ముఖేష్ అంబానీ వివరించారు.
ల్యాండ్‌మార్క్ ఇయర్
కంపెనీ డిజిటల్ కామర్స్, ఇతర కొత్త వ్యాపారాలు దాదాపు రూ.50,000 కోట్ల ఆదాయాన్ని అందించాయి. అంటే మొత్తం రెవెన్యూలో ఇది ఐదో వంతు. "మేము గత రెండు సంవత్సరాలలో 10 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.82 వేల కోట్లు)కుపైగా పెట్టుబడి పెట్టాం. సమ్మిళిత వృద్ధి, అంతర్గత బ్రాండ్‌లను పెంచుకోవడం, సప్లయి చైన్ నెట్‌వర్క్‌లను మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెడుతున్నాం" అని ఇషా అంబానీ చెప్పారు. రిటైల్ వ్యాపారానికి 2023 ఆర్థిక సంవత్సరాన్ని ఒక మైలురాయి సంవత్సరంగా ఆమె అభివర్ణించారు.
ఇదీ చదవండి: తక్కువ ధరలతో రిలయన్స్ కొత్త ఫ్యాషన్ బ్రాండ్.. తొలి స్టోర్ హైదరాబాద్‌లోనే..
“మేము గత సంవత్సరం 3,300 కొత్త స్టోర్‌లను ప్రారంభించాం. మొత్తం స్టోర్‌లు 18,040లకు చేరుకున్నాయి. 6.56 కోట్ల చదరపు అడుగుల రిటైల్ స్థలాన్ని కవర్ చేశాం. ఈ స్టోర్‌లలో మూడింట రెండొంతులు టైర్ 2, టైర్ 3 నగరాలు, చిన్న పట్టణాల్లోనే ఉన్నాయి" అని ఇషా అంబానీ పేర్కొన్నారు. తమ బ్యాకెండ్ వేర్‌హౌసింగ్, లాజిస్టిక్స్ ఆస్తులలో కూడా కంపెనీ పెట్టుబడి పెడుతోంది.
రిలయన్స్ రిటైల్ బలమైన వృద్ధి భారతదేశంలో ఈ-కామర్స్, ఆన్‌లైన్ షాపింగ్‌కు పెరుగుతున్న ప్రజాదరణకు నిదర్శనం. కంపెనీ తన ఫిజికల్ స్టోర్ నెట్‌వర్క్‌ను టైర్ 2, టైర్3 మార్కెట్‌లలోకి విస్తరించడం ద్వారా కూడా ప్రయోజనం పొందుతోంది. భారతదేశంలోని 30 శాతానికి పైగా జనాభాకు తమ ఉత్పత్తులను అందిస్తున్నట్లు ఇషా అంబానీ చెప్పారు. ఇవన్నీ రిలయన్స్ రిటైల్‌ను ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే టాప్-10 రిటైలర్‌లలో ఒకటిగా నిలిపాయని వివరించారు.
నాలుగు ‘సీ’ల సూత్రంపైనే..
రిటైల్ వ్యాపారం కొలాబరేషన్, కన్జ్యూమర్ ఎంగేజ్‌మెంట్, క్రియేటివిటీ, కేర్ అనే 4 సీ(C)ల సూత్రంపై ఆధారపడి ఉంటుంది. రిలయన్స్ రిటైల్ భారతీయ కుటుంబాల రోజువారీ అవసరాలను 90 శాతానికి పైగా తీర్చేలా ఉత్పత్తులను అందిస్తోంది. కిరాణా వ్యాపారంలో ఈ సంవత్సరంలో 18 లక్షల మెట్రిక్ టన్నుల కిరాణా సామగ్రిని విక్రయించాం. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్‌లో సంవత్సరంలో దాదాపు 5 లక్షల ల్యాప్‌టాప్‌లు, 23 లక్షలకు పైగా ఉపకరణాలను విక్రయించాం. ఇక ఫ్యాషన్ & లైఫ్‌స్టైల్ వ్యాపారంలో ఈ సంవత్సరంలో రికార్డు స్థాయిలో 50 కోట్ల వస్త్రాలను విక్రయించినట్లు ఇషా అంబానీ చెప్పారు.
కంపెనీ ఇటీవల యువత లక్ష్యంగా ఫ్యాషన్ రిటైల్ ఫార్మాట్ యూస్టాను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని శరత్ సిటీ మాల్‌లో తన మొదటి స్టోర్‌ను ప్రారంభించింది. ఇది యువతకు సరసమైన ధరలలో ఫ్యాషన్ ఉత్పత్తులు అందిస్తుంది.
ఇదీ చదవండి: అంబానీ కంపెనీ దూకుడు! భారీగా పెరిగిన నికర రుణం.. అయినా తగ్గేదేలే..
Comments
Please login to add a commentAdd a comment