ఆద్యంతం కన్సాలిడేషన్ బాటలో సాగిన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి డీలా పడ్డాయి. సెన్సెక్స్ 52 పాయింట్లు క్షీణించి 38,365 వద్ద ముగిసింది. నిఫ్టీ 38 పాయింట్ల నష్టంతో 11,317 వద్ద నిలిచింది. తొలుత బలహీనంగా ప్రారంభమైన మార్కెట్లు మిడ్‌సెషన్‌కల్లా జోరందుకున్నాయి. అయితే చివరి అర్ధగంటలో అమ్మకాలు ఊపందుకోవడంతో చతికిలపడ్డాయి. దీంతో సెన్సెక్స్ 38,746 గరిష్టాన్ని తాకగా.. 38,275 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. వెరసి 500 పాయింట్ల స్థాయిలో హెచ్చుతగ్గులు నమోదు చేసుకుంది. ఈ బాటలో నిఫ్టీ 11,437- 11,290 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. చైనాతో సరిహద్దు వద్ద సైనిక వివాదాలు, యూరోపియన్ మార్కెట్లలో అమ్మకాల కారణంగా మార్కెట్లు ఒడిదొడుకులను చవిచూసినట్లు నిపుణులు తెలియజేశారు.
ఐటీ మాత్రమే
ఎన్‌ఎస్‌ఈలో ఐటీ 1.2 శాతం పుంజుకోగా మిగిలిన అన్ని రంగాలూ 3-0.6 శాతం మధ్య డీలాపడ్డాయి. ఇంట్రాడేలో ఐటీ ఇండెక్స్ 18,672 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్టాన్ని అందుకోవడం విశేషం! ఏప్రిల్ నుంచి ఈ రంగం 46 శాతం ర్యాలీ చేసింది. 26 రంగాలలో ఐటీ రంగం మాత్రమే కోవిడ్-19 సవాళ్లకు ఎదురు నిలవగలిగినట్లు కేవీ కామత్ కమిటీ తాజాగా పేర్కొనడం ఇందుకు దోహదపడినట్లు నిపుణులు పేర్కొన్నారు.
ఇన్‌ఫ్రాటెల్ పతనం
నిఫ్టీ దిగ్గజాలలో బీపీసీఎల్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, ఆర్‌ఐఎల్, విప్రో, టీసీఎస్, ఐసీఐసీఐ, టెక్ మహీంద్రా 2.7-0.7 శాతం మధ్య ఎగశాయి. అయితే ఇన్‌ఫ్రాటెల్ 8 శాతం పతనంకాగా.. జీ, టాటా మోటార్స్, హిందాల్కో, టాటా స్టీల్, యాక్సిస్, ఎయిర్‌టెల్, గ్రాసిమ్, ఓఎన్‌జీసీ, సన్ ఫార్మా, ఎస్‌బీఐ, శ్రీ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, డాక్టర్ రెడ్డీస్, ఎన్‌టీపీసీ, ఎల్‌అండ్‌టీ, అదానీ పోర్ట్స్, హెచ్‌డీఎఫ్‌పీ లైఫ్ 4.7-1.7 శాతం మధ్య క్షీణించాయి.
ఐడియా వీక్
డెరివేటివ్స్‌లో ఐడియా 8.5 శాతం కుప్పకూలగా.. పీవీఆర్, జిందాల్ స్టీల్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్, సెయిల్, అపోలో టైర్, జీఎంఆర్, ఎన్‌ఎండీసీ, నాల్కో, టాటా పవర్, ఆర్‌బీఎల్ బ్యాంక్, శ్రీరామ్ ట్రాన్స్ 6-4 శాతం మధ్య పతనమయ్యాయి. మరోవైపు ఐబీ హౌసింగ్, ఐసీఐసీఐ ప్రు, గోద్రెజ్ సీపీ, పిరమల్, ఇండిగో, జూబిలెంట్ ఫుడ్, ఎస్‌బీఐ లైఫ్, సీఫోర్జ్ 4.3-0.7 శాతం మధ్య ఎగశాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.5-1 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1717 నష్టపోగా.. 978 మాత్రమే లాభపడ్డాయి.
అమ్మకాల బాట
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) కేవలం రూ. 7 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 816 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. శుక్రవారం సైతం ఎఫ్‌పీఐలు రూ. 1,889 కోట్లు, డీఐఐలు రూ. 457 కోట్లు చొప్పున అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే
Comments
Please login to add a commentAdd a comment