రూ. 2,000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన వెంటనే జువెలరీ షాపులకు ఎంక్వైరీలు వెల్లువెత్తాయి. బంగారం కొనుగోలుకు రూ.2 వేల నోట్లు స్వీకరిస్తారా అని కస్టమర్లు దేశవ్యాప్తంగా పలు జువెలరీ దుకాణాల్లో ఆరా తీస్తున్నారు.
అప్పటి పరిస్థితి ఇప్పుడు లేదు
అయితే 2016లో నోట్ల రద్దు సమయంలో కనిపించిన ఉధృత పరిస్థితి ఇప్పుడు లేదని జువెలర్స్ బాడీ జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) తెలిపింది. వాస్తవానికి రూ.2 వేల నోట్ల మార్పిడి, కఠిన కేవైసీ నిబంధనల నేపథ్యంలో గత రెండు రోజులుగా బంగారం కొనుగోళ్లు మందగించాయి.
10 శాతం వరకు అధిక ధర!
రూ.2 వేల నోట్ల ఉపసంహరణ నేపథ్యంలో కొంతమంది బంగారు వ్యాపారులు కస్టమర్ల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేసినట్లు వార్తలు వచ్చాయి. బంగారం కొనుగోలు కోసం రూ.2 వేలు నోట్లు ఇచ్చే కస్టమర్ల నుంచి 5 నుంచి 10 శాతం అదనంగా తీసుకున్నట్లు తెలిసింది. 10 గ్రాముల గ్రాముల బంగారాన్ని రూ. 66,000 వరకు అమ్మినట్లు చెబుతున్నారు.
అయితే ప్రస్తుతం దేశంలో బంగారం ధర తులం రూ.60,200 మేర ఉంది. కాగా రూ. 2 లక్షల లోపు బంగారం, వెండి ఆభరణాలు, రత్నాల కొనుగోలు కోసం పాన్, ఆధార్ వంటి డాక్యుమెంట్లను కస్టమర్లు సమర్పిచాల్సిన అవసరం లేదు.
‘రూ. 2,000 నోట్లతో బంగారం లేదా వెండిని కొనుగోలు చేసేందుకు కస్టమర్ల నుంచి జువెలరీ షాపులకు అధిక సంఖ్యలో ఎంక్వైరీలు వచ్చాయి. అయితే కఠినమైన కేవైసీ నిబంధనల కారణంగా వాస్తవ కొనుగోళ్లు తక్కువగా ఉన్నాయి’ అని జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ సయమ్ మెహ్రా పీటీఐ వార్తా సంస్థకు చెప్పారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ. 2,000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు మే 19న ప్రకటించింది. ఆ నోట్లను ఖాతాల్లో డిపాజిట్ చేయడానికి, బ్యాంకుల్లో మార్చుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు సమయం ఇచ్చింది. మరోవైపు రూ.2000 నోట్ల చలామణిని తక్షణమే నిలిపివేయాలని బ్యాంకులను కోరింది.
ఇదీ చదవండి: RS 2000 Note: ముగిసిన రూ.2 వేల నోటు శకం.. ఆరేళ్ల ప్రస్థానం..
Comments
Please login to add a commentAdd a comment