న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన 100 కంపెనీల జాబితాలో దేశీ దిగ్గజాలు రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్, ఎడ్‌టెక్ స్టార్టప్ సంస్థ బైజూస్ చోటు దక్కించుకున్నాయి. ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ దీన్ని తొలిసారిగా రూపొందించింది. భవిష్యత్‌కు రూపమిస్తున్న కంపెనీలకు ఈ లిస్టులో చోటు కల్పించినట్లు టైమ్ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. హెల్త్‌కేర్, వినోదం, రవాణా, టెక్నాలజీ సహా పలు రంగాల కంపెనీలను టైమ్ ఇందుకోసం పరిశీలించింది.
నవకల్పనలు, ప్రభావం చూపగలిగే సామర్థ్యం, లీడర్‌షిప్, ఆశయాలు, విజయాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంది. ‘స్మార్ట్‌గా రీసైక్లింగ్ చేసే విధానాలను ఆవిష్కరించిన టెక్ స్టార్టప్, భవిష్యత్తులో నగదు స్వరూపాన్ని మార్చబోతున్న క్రిప్టోకరెన్సీ సంస్థ మొదలుకుని ప్రస్తుత.. భవిష్యత్ అవసరాలకు కావాల్సిన టీకాలను రూపొందిస్తున్న ఫార్మా దిగ్గజాల దాకా 100 పైగా కంపెనీలను పరిశీలించాం. ఈ వ్యాపారాలు.. వాటికి సారథ్యం వహిస్తున్న నాయకులు భవిష్యత్‌కు బాటలు వేస్తున్నారు‘ అని టైమ్ తెలిపింది.
ఆవిష్కర్తల సరసన జియో..: నవకల్పనల ఆవిష్కర్తల కేటగిరీలో జియో ప్లాట్‌ఫామ్స్‌ను టైమ్ చేర్చింది. జూమ్, అడిడాస్, టిక్‌టాక్, ఐకియా, మోడెర్నా, నెట్‌ఫ్లిక్స్ తదితర సంస్థలు ఈ విభాగంలో ఉన్నాయి. ‘గత కొన్నేళ్లుగా దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ .. భారత్‌లో అతి పెద్ద 4జీ నెట్‌వర్క్‌ను నిర్మించింది. ప్రపంచంలోనే అత్యంత తక్కువ రేట్లకే డేటాను అందిస్తోంది. రిలయన్స్ డిజిటల్ వ్యాపారాలకు హోల్డింగ్ కంపెనీ అయిన జియో ప్లాట్‌ఫామ్స్‌కి గల 41 కోట్ల మంది పైగా సబ్‌స్క్రయిబర్స్‌కు చేరువయ్యేందుకు పలు దిగ్గజ ఇన్వెస్టర్లు పోటీపడుతున్నారు‘ అని టైమ్ మ్యాగజైన్ తెలిపింది. జియో గతేడాది 20 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు సమీకరించడం తెలిసిందే.
డిస్రప్టర్స్ కేటగిరీలో బైజూస్
వినూత్న ఆవిష్కరణలతో మార్కెట్‌ను కుదిపేసిన కంపెనీల కేటగిరీలో బైజూస్ చోటు దక్కించుకుంది. టెస్లా, హువావే, షాపిఫై, ఎయిర్‌బీఎన్‌బీ, డీడీ చషింగ్ తదితర సంస్థలు ఈ లిస్టులో ఉన్నాయి. ‘అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చన్నది భారతీయ ఈ–లెర్నింగ్ స్టార్టప్ బైజూస్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌కి బాగా తెలుసు. కోవిడ్–19 మహమ్మారి సమయంలో యూజర్ల సంఖ్య రెట్టింపై 8 కోట్లకు చేరే క్రమంలో టెన్సెంట్, బ్లాక్‌రాక్ లాంటి దిగ్గజ ఇన్వెస్టర్ల నుంచి సమీకరించుకున్న నిధులతో ఆయన పలు సంస్థలు కొనుగోలు చేశారు‘ అని టైమ్ పేర్కొంది. బైజూస్ ఇటీవలే వైట్‌హ్యాట్ జూనియర్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తయారీ సంస్థ ఓస్మో మొదలైన సంస్థలను కొనుగోలు చేసింది. అలాగే, అమెరికా, బ్రిటన్, ఇండోనేసియా, మెక్సికో, బ్రెజిల్ తదితర దేశాలకు కూడా కార్యకలాపాలు విస్తరించే ప్రయత్నాల్లో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment