న్యూఢిల్లీ: ఖరీదైన అపార్ట్‌మెంట్ల అమ్మకాలు దేశంలోని ఏడు ప్రధాన పట్టణాల్లో జోరుగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో రూ.కోటికి పైన విలువ చేసే ఫ్లాట్ అమ్మకాలు 50,132 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది తొలి ఆరు నెలల కాలంలో అమ్మకాలు 33,477 యూనిట్లతో పోలిస్తే 50 శాతం పెరిగినట్లు పీటీఐ నివేదించింది. అంతేకాదు 15 ఏళ్లలో తొలిసారి
విలాసవంత ప్రాపర్టీలకు మంచి డిమాండ్ కనిపిస్తున్నట్టు జెల్‌ఎల్ ఇండియా ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. విల్లా, ప్లాట్ల అమ్మకాలను ఇందులో జేఎల్‌ఎల్ ఇండియా కలపలేదు. కేవలం అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల అమ్మకాలనే పరిగణనలోకి తీసుకుంది.
►ఏడు పట్టణాల్లో మొత్తం మీద అన్ని రకాల ఫ్లాట్ల అమ్మకాలు 2023 జనవరి–జూన్ కాలంలో 21 శాతం పెరిగి 1,26,500 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 1,04,926 యూనిట్లుగా ఉన్నాయి. జనవరి - జూన్ అమ్మకాలు 15 ఏళ్లలో అత్యధికంగా ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో జరిగినట్లు స్పష్టం చేసింది.
►రూ.50 లక్షల ధరలోపు ఉన్న ఫ్లాట్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చినప్పుడు, 2 శాతం క్షీణించి 24,482 యూనిట్లుగా ఉన్నాయి. మొత్తం అమ్మకాల్లో అఫర్డబుల్ విభాగం (అందుబాటు ధరల) ఫ్లాట్ల వాటా 24 శాతం నుంచి 17 శాతానికి పరిమితమైంది.
►రూ.50–75 లక్షల విభాగంలో అమ్మకాలు 4 శాతం పెరిగి 30,125 యూనిట్లుగా ఉన్నాయి. మిడ్ సెగ్మెంట్ అమ్మకాల వాటా మొత్తం అమ్మకాల్లో 28 శాతం నుంచి 24 శాతానికి తగ్గింది.
►రూ.75 లక్షల నుంచి రూ.కోటి వరకు విలువ కలిగిన ఫ్లాట్ల అమ్మకాలు 25 శాతం వృద్ధితో 21,848 యూనిట్లకు చేరాయి. ఈ విభాగం వాటా 17 శాతంగా ఉంది.
►రూ.1–1.5 కోట్ల ధరల విభాగంలో అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 67 శాతం పెరిగి 24,121 యూనిట్లుగా ఉన్నాయి.
►ఇక రూ.1.5 పైన ధర కలిగిన ఫ్లాట్లు 26,011 యూనిట్లు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 18,993 యూనిట్లతో పోలిస్తే 21 శాతం పెరిగాయి.
ద్వితీయ భాగంలోనూ బలమైన అమ్మకాలు
ప్రస్తుత ఏడాది ద్వితీయ ఆరు నెలల కాలంలో పండుగలు ఉండడంతో బలమైన అమ్మకాలు నమోదు అవుతాయని భావిస్తున్నట్టు జేఎల్‌ఎల్ ఇండియా ఎండీ శివకృష్ణన్ తెలిపారు. ‘‘ప్రభుత్వం వైపు నుంచి బలమైన ప్రోత్సాహం, వడ్డీ రేట్లను గత రెండు సమీక్షల నుంచి ఆర్‌బీఐ యథాతథంగా కొనసాగించడం, ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయికి దిగిరావడం ఇళ్ల మార్కెట్ పుంజుకునేందుకు మద్దతుగా నిలిచాయి. మధ్య కాలానికి ఇళ్లకు డిమాండ్ వృద్ధి బాటలోనే ఉంటుంది’’అని శివకృష్ణన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment