న్యూఢిల్లీ: దేశంలోని ఏడు ప్రముఖ పట్టణాల్లో కార్యాలయ స్థలాల లీజు (ఆఫీస్ స్పేస్) 2021లో నామమాత్రంగా 2 శాతం పురోగతే చూపించింది. 2019తో పోలిస్తే 45 శాతం తక్కువగా ఉండడం ఈ మార్కెట్ కరోనా దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదని తెలియజేస్తోంది. కరోనా తర్వాత చాలా కంపెనీలు వర్క్‌ఫ్రమ్ హోమ్ పని విధానాన్ని అమలు చేస్తుండడం తెలిసిందే. 2021లో 26.17 చదరపు అడుగుల స్థలం నికరంగా లీజుకు ఇచ్చినట్టు జేఎల్‌ఎల్ ఇండియా విడుదల చేసిన నివేదిక ఆధారంగా తెలుస్తోంది. 2019లో నికర ఆఫీస్ స్పేస్ లీజు 47.8 మిలియన్ చదరపు అడుగులతో పోలిస్తే 45 శాతం తక్కువ. 2020లో 25.66 మిలియన్ చదరపు అడుగుల మేర ఉండడం గమనార్హం. భారత కార్యాలయ మార్కెట్‌పై జేఎల్‌ఎల్ ఇండియా త్రైమాసికం, ఏడాదికోసారి నివేదికలను విడుదల చేస్తుంటుంది. నికర వినియోగ లీజు స్థలాన్ని, మొత్తం వినియోగానికి అందుబాటులో ఉన్న కార్యాలయం స్థలం నుంచి ఖాళీగా ఉన్న దానిని మినహాయించి చెప్తారు.
అక్టోబర్–డిసెంబర్‌లో మెరుగు
2021 అక్టోబర్–నవంబర్ కాలంలో లీజు కింద నికర కార్యాలయ స్థలం వినియోగం 37 శాతం పెరిగి 11.56 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. గడిచిన ఎనిమిది త్రైమాసికాల్లోనే ఇది అధికమని జేఎల్‌ఎల్ ఇండియా తెలిపింది. పూర్తి సంవత్సరానికి ఐటీ/ఐటీఈఎస్ రంగం అత్యధిక స్థలాన్ని వినియోగించుకుంది. 38.9 శాతం ఆఫీసు స్థలం ఈ రంగానికి చెందిన కంపెనీలే లీజుకు తీసుకున్నాయి. ఆ తర్వాత తయారీ/ఇండస్ట్రియల్ రంగం 15.4 శాతం కార్యాలయ స్థలాన్ని వినియోగించుకుంది.
హైదరాబాద్‌లో క్షీణత
హైదరాబాద్ మార్కెట్‌లో కార్యాలయ స్థలాల వినియోగం 2021లో 36 శాతం తగ్గి 4.14 మిలియన్ చదరపు అడుగులకు పరిమితమైంది. అంతకుముందు సంవత్సరంలో ఇది 6.48 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. బెంగళూరులో 14 శాతం వృద్ధితో నికర లీజు 7.82 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ఆ తర్వాత ఢిల్లీ ఎన్‌సీఆర్ మార్కెట్‌లో నికర లీజు 44 శాతం పెరిగి 4.72 మిలియన్ చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. కోల్‌కతాలో మూడు రెట్లు పెరిగి 0.57 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. పుణె నగరంలోనూ 26 శాతం పెరిగి 3.18 మిలియన్ చదరపు అడుగుల కార్యాలయ స్థలం నికర లీజు కింద వినియోగమైంది. చెన్నై నగరంలో నికర లీజు స్థలం 10 శాతం తగ్గి 2.03 మిలియన్ చదరపు అడుగులకు పరిమితమైంది. ముంబైలోనూ 10 శాతం తగ్గి 3.7 మిలియన్ చదరపు అడుగుల స్థలం లీజు కింద వినియోగమైంది.
మూడు నెలలు గడిస్తే..
‘‘నూతన సంవత్సరంలోకి ప్రవేశించాం. కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో తిరిగి కార్యాలయానికి వచ్చి ఉద్యోగులు పనిచేయాలనే ప్రణాళికలు వాయిదా పడొచ్చు. మొదటి త్రైమాసికంలో పరిస్థితుల ఆధారంగా స్పష్టత వస్తుంది’’ అని జేఎల్‌ఎల్ ఇండియా పేర్కొంది.
చదవండి: రియల్టీ పెట్టుబడులు డౌన్
Comments
Please login to add a commentAdd a comment