
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఇల్లు యాంటీలియా సమీపంలో నిలిపి ఉంచిన వాహనంలో పేలుడు పదార్థాలు లభించడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఇదే వాహనంలో బెదిరింపు లేఖ బయటపడింది. ‘ఇది కేవలం ట్రెయిలర్ మాత్రమే’ అని ఇందులో రాసి ఉంది. డ్రైవర్ సీటు పక్కనే ముంబై ఇండియన్స్ క్రికెట్ జట్టు బ్యాగులో ఈ లేఖను పోలీసులు గుర్తించారు. ఆగంతకులు ముకేష్ అంబానీ కుటుంబాన్ని ఉద్దేశిస్తూ ఈ లేఖ రాశారు.
నీతా అంబానీ, ముకేష్ భయ్యాకు ఇదొక ఝలక్ అని, ఏర్పాట్లు జరుగుతున్నాయని, నెక్ట్స్ టైమ్ ఇవి(పేలుడు పదార్థాలు) మిమ్మల్ని చేరుకుంటాయని అందులో ఉంది. పేలుడు పదార్థాలతో కూడిన కారును యాంటీలియా పక్కనే పార్కు చేయాలని దుండుగులు భావించినట్లు, అక్కడ పటిష్టమైన భద్రత ఉండడంతో కొంత దూరంలో నిలిపి ఉంచినట్లు పోలీసులు భావిస్తున్నారు. ముకేష్ అంబానీ సెక్యూరిటీ వాహనం నంబర్ ప్లేట్‌పై ఉన్న రిజిస్ట్రేషన్ నెంబరే ఈ స్కార్పియో నంబర్ ప్లేట్‌పై ఉండడం గమనార్హం. స్కార్పియోను దుండుగులు చోరీ చేసి, తీసుకొచ్చారని పోలీసులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment