
కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్న ‘బిట్‌కాయిన్ స్కామ్’ వ్యవహారం.. విమర్శలు, ప్రతివిమర్శలతో మరింత ముదురుతోంది. ఈ స్కామ్‌లో ప్రధాన నిందితుడు శ్రీకృష్ణ అలియాస్ శ్రీకి మీద తాజాగా సంచలన ఆరోపణలు చేశారు మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి.
జన ధన్ అకౌంట్లను సైతం హ్యాక్ చేసిన నిందితుడు.. అకౌంట్ల నుంచి 2రూ. చొప్పున.. మొత్తం 6 వేల కోట్ల రూపాయల్ని తస్కరించాడని కుమారస్వామి ఆరోపించారు. అయితే తన దగ్గర పక్కా ఆధారాలు లేకపోయినప్పటికీ ఈ విషయమై తనకు సమాచారం అందిందని, కేవలం జన్ ధన్ నుంచే ఈ సొమ్ము మళ్లిపోయిందని వ్యాఖ్యానించారాయన. బీజేపీ ప్రభుత్వం తీరు చూస్తుంటే.. ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయని కుమారస్వామి అంటున్నారు.
ఇదిలా ఉంటే క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌కు భారత్‌తో సహా చాలా దేశాల్లో చట్టబద్దత లేదు. ఈ తరుణంలో శ్రీకి నుంచి సుమారు 9 కోట్ల రూపాయల విలువైన బిట్‌కాయిన్స్‌ను అధికారులు సీజ్ చేశారు. అంతేకాదు ప్రభుత్వ వెబ్‌సైట్లను సైతం హ్యాక్ చేసి డార్క్ నెట్ ద్వారా డ్రగ్స్ కార్యకలాపాలు కొనసాగించాడని శ్రీకృష్ణపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక బడా నేతలు, పొలిటీషియన్ల పిల్లలు సైతం ఇన్‌వాల్వ్ అయ్యారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న క్రమంలో.. ఈ స్కామ్ ప్రస్తుతం దేశవ్యాప్త చర్చకు దారితీసింది.
అయితే బిట్‌కాయిన్ ఆరోపణలను ప్రధాని నరేంద్ర మోదీ వద్ద ప్రస్తావించగా దీని గురించి పట్టించుకోరాదని, ప్రజల కోసం సమర్థంగా పనిచేయాలని సలహా ఇచ్చారని గురువారం ప్రధానితో భేటీ అనంతరం కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై మీడియాకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment