
ముంబై: ప్రైవేటు రంగంలోని కోటక్ మహీంద్రా బ్యాంక్ గృహ రుణ వడ్డీరేటు స్వల్పంగా 0.05 శాతం పెరిగింది. డిసెంబర్ 10వ తేదీ నుంచి కొత్త రేటు అమల్లోకి వస్తుంది. దేశంలో వడ్డీరేట్ల పెంపునకు అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో ఈ విషయంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ బ్యాంక్ గృహ రుణ రేటు 6.50 శాతం అయితే, ఇది 6.55 శాతానికి పెరిగింది. నిజానికి పండుగల సీజన్ నేపథ్యంలో బ్యాంక్ సెప్టెంబర్‌లో వడ్డీరేటును తగ్గించింది. పోటీరీత్యా మిగిలిన బ్యాంకులూ ఈ దిశలో నిర్ణయం తీసుకున్నాయి.తమ ప్రత్యేక 60 రోజుల పండుగల సీజన్ ఆఫర్‌కు కస్టమర్ల నుంచి మంచి స్పందన లభించినట్లు బ్యాంక్ కన్జూమర్ బిజినెస్ వ్యవహారాల ప్రెసిడెంట్ అంబుజ్ చందనా పేర్కొనడం గమనార్హం.
కోటక్ కీలక ట్వీట్ నేపథ్యం...
కోటక్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్ ఆదివారం చేసిన ట్వీట్ నేపథ్యంలో బ్యాంక్ తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ‘ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకులు ప్రస్తుతం అన్ని సమస్యలకు ఒకేఒక్క ఔషధం కలిగి ఉన్నాయి. అది కరెన్సీ ముద్రణ. చౌక రుణ లభ్యత. వాతావరణ మార్పులాగా ఇది భవిష్యత్ తరానికి సంబంధించిన సమస్య. మనం దీనిని పరిష్కరించాలి’ అని ఉదయ్ కోటక్ ఈ ట్వీట్‌లో పేర్కొన్నారు.