ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రస్తుత ఏడాది(2022–23) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 21 శాతం పుంజుకుని రూ. 3,608 కోట్లను తాకింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 27 శాతం జంప్‌చేసి రూ. 2,581 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ. 8,408 కోట్ల నుంచి రూ. 10,047 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 27 శాతం బలపడి రూ. 5,099 కోట్లను తాకింది.
నికర వడ్డీ మార్జిన్లు 5.17 శాతానికి చేరాయి. అయితే ఆటోమాటిక్ పద్ధతిన రుణాలపై మార్కెట్‌కు అనుసంధానమైన రేట్లతో మార్జిన్లు మెరుగుపడటం ఇందుకు దోహదం చేసినప్పటికీ భవిష్యత్‌లో 4.25–4.35 శాతం స్థాయిలో ఇవి కొనసాగగలవని బ్యాంక్ వివరించింది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 3.19 శాతం నుంచి 2.08 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు 1.06 శాతం నుంచి 0.55 శాతానికి దిగివచ్చాయి. తాజా స్లిప్పేజీలు రూ. 983 కోట్లుగా నమోదయ్యాయి.
అనుబంధ సంస్థల తీరు ఇదీ..
కోటక్ బ్యాంక్ అనుబంధ సంస్థలలో లైఫ్ ఇన్సూరెన్స్ లాభం రూ. 155 కోట్ల నుంచి రూ. 270 కోట్లకు ఎగసింది. సెక్యూరిటీస్ లాభం రూ. 243 కోట్ల నుంచి రూ. 224 కోట్లకు తగ్గింది. కొటక్ ప్రైమ్ లాభం రూ. 18 కోట్లు తక్కువగా రూ. 222 కోట్లకు పరిమితమైంది. ట్రస్టీ విభాగం నుంచి రూ. 9 కోట్లు అధికంగా రూ. 106 కోట్లు లభించినట్లు కొటక్ బ్యాంక్ వెల్లడించింది. కోటక్ ఇన్వెస్ట్‌మెంట్స్ రూ. 11 కోట్లు తగ్గి రూ. 78 కోట్ల లాభం ఆర్జించింది. మైక్రోఫైనాన్స్ లాభం రూ. 8 కోట్ల నుంచి ఏకంగా రూ. 70 కోట్లకు దూసుకెళ్లింది. అయితే కోటక్ క్యాపిటల్ లాభం రూ. 58 కోట్ల నుంచి రూ. 22 కోట్లకు క్షీణించింది.
చదవండి: వైద్యుడే వాచ్ రూపంలో వచ్చినట్టు.. చిన్నారి ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్!
Comments
Please login to add a commentAdd a comment