
ముంబై: రాబోయే పబ్లిక్ ఇష్యూలో (ఐపీవో) షేర్లను కొనుగోలు చేసేందుకు ఎల్‌ఐసీ పాలసీదారులు ఫిబ్రవరి 28లోగా తమ పర్మనెంట్ అకౌంటు నంబరు (పాన్) వివరాలను.. పాలసీ రికార్డులో అప్‌డేట్ చేసుకోవాల్సి రానుంది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ఫిబ్రవరి 13న ఎల్‌ఐసీ దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌లో సంస్థ ఈ విషయం పేర్కొంది.
ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన రెండు వారాలు ముగిసేలోగా పాన్ వివరాలను ఎల్‌ఐసీ వద్ద అప్‌డేట్ చేసుకోని పాలసీదార్లను..షేర్ల కొనుగోలుగా అర్హులుగా పరిగణించబోమని తెలిపింది. కంపెనీ వెబ్‌సైట్‌లో నేరుగా లేదా ఏజెంట్ల సహాయంతో అప్‌డేషన్ చేసుకోవచ్చని వివరించింది. డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసే నాటికి, బిడ్/ఆఫర్ ప్రారంభమయ్యే తేదీ నాటికి ఒకటి లేదా అంతకు మించి పాలసీలు ఉన్న వారు.. పాలసీహోల్డర్ రిజర్వేషన్ పోర్షన్ కింద షేర్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులై ఉంటారని పేర్కొంది.
వారికి డీమ్యాట్ ఖాతా కూడా ఉండాలి. ఇష్యూలో దాదాపు 10 శాతం వరకూ పాలసీదారుల కోసం కేటాయించవచ్చని, పాలసీహోల్డర్లకు ఐపీవో ఇష్యూ ధరలో దాదాపు 10 శాతం వరకూ డిస్కౌంటు లభించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం.. ఐపీవో కింద ఎల్‌ఐసీలో 5% వాటా (31.6 కోట్ల షేర్లు) విక్రయించనుంది. దీని విలువ దాదాపు రూ. 63,000 కోట్లుగా ఉంటుందని, ఇష్యూ మార్చిలో ఉంటుందని అంచనా.
చదవండి: ఎల్ఐసీ ఐపీఓలో పాల్గొనే పాలసీదారులకు షాక్..!
Comments
Please login to add a commentAdd a comment