న్యూఢిల్లీ: ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూలో పాల్గొనేందుకు తమ తమ పాన్ నంబర్లను అప్‌డేట్ చేయాల్సిందిగా పాలసీదారులకు ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) సూచించింది. ఇష్యూకి సబ్‌స్క్రయిబ్ చేయాలంటే కంపెనీ రికార్డుల్లో పాలసీదారుల తాజా పాన్ వివరాలు ఉండాలని, అలాగే చెల్లుబాటయ్యే డీమ్యాట్ ఖాతా అవసరమని పేర్కొంది. దీనిపై పాలసీహోల్డర్లలో అవగాహన పెంచేందుకు ప్రచార కార్యకర్మాలు నిర్వహిస్తున్నామని ఎల్‌ఐసీ తెలిపింది. ఒకవేళ ఎవరికైనా డీమ్యాట్ ఖాతా లేకపోతే తమ సొంత ఖర్చుతో ఒక అకౌంటును తీసుకోవాలని పేర్కొంది. సదరు డీమ్యాట్ ఖాతా తెరవడం, నిర్వహణ.. పాన్ జారీ మొదలైన వాటికి అయ్యే ఖర్చు లను పాలసీదారే భరించాల్సి ఉంటుందని, కంపెనీకి సంబంధం లేదని ఎల్‌ఐసీ స్పష్టం చేసింది.
ఐపీవోకి రెడీ
ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూ ప్రతిపాదనకు ఈ ఏడాది జూలైలో ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరంలోనే దీన్ని పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపాదన ప్రకారం ఇష్యూ పరిమాణంలో 10 శాతం దాకా షేర్లను పాలసీదారులకు కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ.1.75 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఈ లక్ష్యాన్ని సాధించడంలో ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూ కీలకంగా ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment