కేప్‌టౌన్ (దక్షిణాఫ్రికా): మహారాష్ట్రలోని చకాన్‌లో నెలకొల్పుతున్న ప్లాంటు నుంచి వార్షికంగా 2 లక్షల ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని సాధించాలని మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) నిర్దేశించుకుంది. 2027–29 మధ్య కాలంలో దీన్ని సాధించగలమని సంస్థ ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ విభాగం) వీజే నక్రా తెలిపారు.
2030 నాటికల్లా తమ మొత్తం వాహన విక్రయాల్లో 30 శాతం వాటా ఎలక్ట్రిక్ వాహనాలదే ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు. బీఈ శ్రేణిలో తొలి వాహనాన్ని వచ్చే ఏడాది ఆఖర్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అంతకన్నా 4–5 నెలల ముందు నుంచే చకాన్ ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభం కాగలదని నక్రా వివరించారు.
చకాన్‌లో రూ. 10,000 కోట్లతో విద్యుత్ వాహనాల ప్లాంటును నెలకొల్పేందుకు కంపెనీకి ఈ ఏడాది జనవరిలో అనుమతులు లభించాయి. బార్న్ ఎలక్ట్రిక్ (బీఈ) మోడల్స్ తయారీ కోసం ఈ ప్లాంటుపై వచ్చే 7–8 ఏళ్లలో కంపెనీ భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. ఎక్స్‌యూవీ, కేవలం విద్యుత్ వాహనాల కోసమే ఉద్దేశించిన బీఈ బ్రాండ్‌ల కింద మొత్తం అయిదు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మోడల్స్‌ను ప్రవేశపెట్టడంపై కంపెనీ కసరత్తు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment