ఉద్యోగుల విషయంలో టెక్ దిగ్గజం టీసీఎస్ అమానుషంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా 2 వేల మంది ఉద్యోగుల్ని రీలొకేట్ చేసిందంటూ ఐటీ ఉద్యోగుల సంఘం ‘నైట్స్’ ఆరోపించింది. తాజాగా, వారిలో చెప్పిన మాట వినలేదన్న కారణంతో 900 మంది ఉద్యోగుల జీతాల్ని నిలిపివేసిందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ అంశం టెక్ కంపెనీల్లో చర్చాంశనీయంగా మారింది.
ఇటీవల కాలంలో చిన్న చిన్న స్టార్టప్స్ నుంచి విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి టెక్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోంకు స్వస్తి చెబుతున్నాయి. ఉద్యోగులు ఆఫీస్‌కు రావాలంటూ పిలుపు నిస్తున్నాయి.
2 వేల మంది బదిలీ
అయితే, గత ఏడాది నవంబర్‌లో టీసీఎస్ 2వేల మంది టెక్కీలకు వర్క్ ఫ్రమ్ హోంను రద్దు చేసింది. ఆఫీస్‌కు రావాలని ఆదేశించింది. ఆ సమయంలో వారికి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే 2 వేల మంది ఉద్యోగుల్ని ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ చేసింది. ఇందుకోసం 15 రోజులు గడువు విధించింది. గడువు ముగిసే లోపు ఉద్యోగులు బదిలి చేసిన ప్రాంతానికి వెళ్లాల్సిందే. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ అంశంపై టీసీఎస్ ఉద్యోగులు.. ఐటీ ఉద్యోగుల సంఘం నైట్స్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో నైట్స్ కేంద్ర కార్మిక శాఖను ఆశ్రయించింది.
ఐటీ ఉద్యోగుల్ని కాపాడండి
ఈ తరుణంలో నైట్స్ తాజాగా టీసీఎస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహరాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. దీంతో మహరాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ ఉద్యోగుల రీలొకేట్ అంశంపై వివరణ ఇవ్వాలని కోరుతూ టీసీఎస్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న తమను కలవాలని టీసీఎస్ ప్రతినిధులను కార్మిక శాఖ ఆదేశించినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా టీసీఎస్ చర్యలపై దర్యాప్తు చేయాలని, ఆ సంస్థ అనైతిక పద్దతుల నుంచి ఐటీ ఉద్యోగుల్ని కాపాడాలని కోరినట్లు నైట్స్ ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలుజా ఒక ప్రకటనలో తెలిపారు.
900 మంది ఉద్యోగుల జీతాల నిలిపివేత
ఈ నేపథ్యంలో ఉద్యోగుల పట్ల టీసీఎస్ వ్యవహరిస్తున్న తీరుపై విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగులకు బదిలీ నోటీసులు పంపిన కొద్ది నెలలకే తమ కంపెనీ విధానాలకు అనుగుణంగా లేరంటూ 900 మందికి పైగా జీతాలు చెల్లించకుండా నిలిపివేసినట్లు సమాచారం. దీనిపై టీసీఎస్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
జీతాల్ని నిలిపి వేసి
“రీలొకేషన్‌ను వ్యతిరేకిస్తున్న ఉద్యోగుల జీతాలను టీసీఎస్ అనైతికంగా నిలిపివేసింది. బలవంతపు బదిలీలను అంగీకరించమని లేదా ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఆదేశించింది. ఇలా ఉద్యోగులను ఇబ్బంది పెట్టేలా ఉన్న టీసీఎస్ చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్ని నైట్స్ తీవ్రంగా ఖండిస్తుంది. రీలొకేషన్ వల్ల ఉద్యోగులకు కలిగి ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ అంతరాయం, ఒత్తిడి, ఆందోళనలన్నింటినీ కంపెనీ విస్మరిస్తోంది’’ అని వ్యాఖ్యానించింది.
నా జీతం 6వేలే
మరోవైపు ఓ జాతీయ మీడియా సంస్థ బాధిత ఉద్యోగుల్లోని కొందరితో గూగుల్‌మీట్‌లో మాట్లాడింది. ‘‘మమ్మల్ని రీలొకేట్ చేసింది కానీ ఎలాంటి ప్రాజెక్ట్ ఇవ్వలేదు. కంపెనీ పోర్టల్ అల్టిమాటిక్స్‌లో టైమ్ షీట్‌ను అప్‌డేట్ చేయలేదనే కారణంతో కొంతమంది ఉద్యోగులకు డిసెంబర్ నెలకు కేవలం రూ. 6వేలు మాత్రమే చెల్లించింది’’ అని ఓ ఉద్యోగి వాపోయాడు.
మాట వినలేదని
బాధిత ఉద్యోగులలో ఓ ఉద్యోగికి టీసీఎస్ ఓ మెయిల్ పంపింది. అందులో ఇలా ఉంది.. “ఈ ఈమెయిల్ మిమ్మల్ని టీసీఎస్ ముంబై బ్రాంచ్ రీలొకేషన్‌కు సంబంధించింది. 14 రోజుల్లోపు సంబంధిత బ్రాంచ్‌కు సమాచారం అందించి.. ఈ కాపీలో ఉన్న వివరాల్ని మీరు పూర్తి చేసి మెయిల్‌కు రిప్లయి ఇవ్వండి’’ అని సారాంశం. ఈ మెయిల్ వచ్చిన కొద్దిరోజులకు మరో మెయిల్ వచ్చింది. మీరు ఇప్పటి వరకు బదిలీ చేసిన బ్రాంచ్‌కి రిపోర్ట్ చేయడంలో విఫలమయ్యారని గుర్తించాం. కంపెనీ నిర్ణయాన్ని పాటించనుందుకు మీ జీతాన్ని తక్షణమే నిలిపి వేస్తున్నాం అని మెయిల్‌లో తెలిపింది.
చేతిలో ప్రాజెక్టేలేదు..
“ఆర్ధిక సమస్యల కారణంగా మా ప్రాజెక్ట్ ఆగిపోయింది. 3-4 నెలలు బెంచ్‌లో ఉన్నాం. ఆ సమయంలో, నాకు ప్రాజెక్ట్ ఇవ్వకుండా వేరే ప్రాంతానికి వెళ్లమని సంస్థ ఆదేశించింది. బెంచ్‌లో ఉన్నప్పుడు నేను ఎక్కడ ఉంటే ఏం లాభం’’ అని మరో ఉద్యోగి ప్రశ్నించాడు.
Comments
Please login to add a commentAdd a comment