ముంబై: ఫార్మా, ఐటీ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు రెండోరోజూ లాభపడ్డాయి. అయితే విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ఉపసంహరణ మార్కెట్ భారీ ర్యాలీకి ప్రతిబంధకంగా మారింది. ఈ వారంలో ఆర్‌బీఐ ద్రవ్య విధాన వైఖరి, అమెరికా ద్రవ్యోల్బోణ డేటాతో సహా పలు దేశాల కీలక స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం సానుకూలంగా మొదలయ్యాయి.
ట్రేడింగ్ ఆద్యంతం పరిమిత శ్రేణిలో లాభ, నష్టాల మధ్య కదలాడుతూ ఊగిసలాట వైఖరిని ప్రదర్శించాయి. సెన్సెక్స్ ఉదయం 90 పాయింట్లు పెరిగి 65,811 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 65,748 వద్ద కనిష్టాన్ని, 66,068 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 232 పాయింట్లు పెరిగి 65,953 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 60 పాయింట్లు బలపడి 19,577 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఇంట్రాడేలో 19,525 – 19,620 పరిధిలో కదలాడింది. ఆఖరికి 80 పాయింట్లు పెరిగి 19,597 వద్ద నిలిచింది. ఫార్మా, ఐటీతో పాటు ఇంధన, రియల్టీ, ఆటో షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు అరశాతం చొప్పున లాభపడ్డాయి.
బ్యాంకులు, మెటల్, మీడియా, ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,893 కోట్ల షేర్లను విక్రయించగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,081 కోట్ల షేర్లను కొన్నారు. సెన్సెక్స్ 232 పాయింట్లు లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.22 లక్షల కోట్లు పెరిగి రూ.305.38 లక్షల కోట్లకు చేరింది. అమెరికా బాండ్లపై రాబడులు పెరగడం, యూరోజోన్ స్థూల ఆర్థిక గణాంకాలు నిరాశపరచడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో అధిక భాగం నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
మార్కెట్లో మరిన్ని సంగతులు...
►జూన్ క్వార్టర్‌లో నికర లాభం 56.04% వృద్ధి చెందడంతో మహీంద్రా అండ్ మహీంద్రా షేరు 4% లాభపడి రూ.1,527 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో నాలుగున్నర శాతం దూసుకెళ్లి రూ.1,531 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. దీంతో కంపెనీ విలువ ఒక్క రోజులో రూ.7,673 కోట్లు పెరిగి రూ.1.90 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ సూచీలో అత్యధికంగా లాభపడిన షేరు ఇదే.
►యధార్థ్ హాస్పిటల్ అండ్ ట్రామా కేర్ సర్వీసెస్ లిమిటెడ్ షేరు లిస్టింగ్ రోజు 11% ర్యాలీ చేసింది. ఈక్విటీ మార్కెట్లలోని అస్థిరత పరిస్థితుల దృష్ట్యా బీఎస్‌ఈలో ఇష్యూ ధర(రూ.300)తో పోలిస్తే 2% స్వల్ప ప్రీమియంతో రూ.306 వద్ద లిస్టయ్యింది. ఒక దశలో 14% ఎగసి రూ.343 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 11% లాభంతో రూ.334 వద్ద స్థిరపడింది. ఎక్సే్చంజీలో మొత్తం 15.16 లక్షల ఈక్విటీ షేర్లు చేతులు మారాయి. కంపెనీ విలువ రూ.2,854 కోట్లుగా నమోదైంది.
► తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోవడంలో విఫలం కావడంతో బ్రిటానియా షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఎన్‌ఎస్‌ఈలో రెండున్నర శాతానికి పైగా నష్టపోయి రూ.4,670 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో నాలుగుశాతం క్షీణించి రూ.4618 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని దిగివచ్చింది. నిఫ్టీ–50 సూచీలో అత్యధికంగా నష్టపోయిన షేరు ఇదే కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment