ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా మార్చి త్రైమాసికంలో మెరుగైన పనితీరు చూపించింది. స్టాండలోన్ నికర లాభం భారీగా పెరిగి రూ.1,192 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ.245 కోట్లుగానే ఉండడం గమనార్హం. ఆదాయం 28 శాతం పెరిగి రూ.17,124 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.13,356 కోట్లుగా ఉంది. 2021–22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి స్టాండలోన్ లాభం రూ.4,935 కోట్లుగా నమోదైంది.
అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.984 కోట్లుగానే ఉంది. ఇక ఆదాయం రూ.55,300 కోట్లుగా నమోదైంది. సంస్థ చరిత్రలో ఒక ఆర్థిక సంవత్సరంలో అత్యధిక స్టాండలోన్ లాభం ఇదేనని ఎంఅండ్‌ఎం ప్రకటించింది. అలాగే, కంపెనీ చరిత్రలోనే అత్యధిక సంఖ్యలో (ఒక త్రైమాసికానికి) యుటిలిటీ వాహనాలను మార్చి త్రైమాసికంలో విక్రయించినట్టు తెలిపింది. సాగు పరికరాలు, ట్రాక్టర్ల విభాగంలో (ఎఫ్‌ఈఎస్) కంపెనీ మార్కెట్ వాటా 40 శాతంగా ఉంది. ఎగుమతుల్లో సంస్థ 77 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2021–22లో 17,500 ట్రాక్టర్లను సంస్థ ఎగుమతి చేసింది. ఇది కూడా ఒక ఆర్థిక సంవత్సరంలో రికార్డు గరిష్టం కావడం గమనార్హం. క్యూ4లో ఎస్‌యూవీ ఆదాయం పరంగా చూస్తే నంబర్1 స్థానంలో ఉంది.
‘‘క్యూ4లో పనితీరు మా వ్యాపార బలానికి నిదర్శనం. కరోనా, కమోడిటీ ధరలు, సెమీ కండక్టర్ల కొరత, ఉక్రెయిన్ సంక్షోభం తదితర రూపాల్లో సవాళ్లు ఉన్నప్పటికీ బలమైన ఫలితాలను నమోదు చేశాం. వృద్ధి అవకాశాలను అందుకునేందుకు గ్రూపు కంపెనీలు అన్నీ మంచి స్థితిలో ఉన్నాయి’’ అని ఎంఅండ్‌ఎం ఎండీ, సీఈవో అనీష్‌షా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment