Mahindra Thar vs Maruti Jimny: భారతీయ మార్కెట్లో చెప్పుకోదగ్గ అత్యంత ప్రజాదరణ పొందిన ఆఫ్ రోడర్ ఏది అనగానే టక్కున వచ్చే సమాధానం మహీంద్రా కంపెనీకి చెందిన థార్. అయితే థార్ ఎస్‌యువికి అసలు సిసలైన ప్రత్యర్థిగా 'మారుతి జిమ్నీ' ఇటీవలే దేశీయ విఫణిలో అడుగెట్టింది. ఈ రెండు ఆఫ్ రోడర్ల మధ్య ఉన్న వ్యత్యాసం ఈ కథనంలో తెలుసుకుందాం.
డిజైన్
మారుతి సుజుకి జిమ్నీ బాడీ-ఆన్-ఫ్రేమ్ డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది. అంటే బాడీ ప్రత్యేక ఛాసిస్‌పై నిర్మించబడి ఉంటుంది. కంపెనీకి చెందిన ఇతర కార్ల మాదిరిగా కాకుండా ఇది చాలా ప్రత్యేకమైన డిజైన్ పొందుతుంది. ఇందులో రౌండ్ హెడ్ లైట్స్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు, స్కేల్డ్-డౌన్ జి-వ్యాగన్ మాదిరిగానే బాక్సీ డిజైన్‌తో నిటారుగా ఉన్న ఫ్రంట్ గ్రిల్ ఉన్నాయి. ఇది ప్రత్యేకంగా భారతీయ భూభాగాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది.
మహీంద్రా థార్ విషయానికి వస్తే, ఇది బాడీ-ఆన్-ఫ్రేమ్ డిజైన్ పొందుతుంది. ఇది ఆఫ్-రోడింగ్ చేయడానికి అనుకూలమైన వాహనం. ఇది సాఫ్ట్ టాప్ మరియు హార్డ్ టాప్ అనే రెండు ఆప్షన్స్ పొందుతుంది.
ఫీచర్స్
ఫీచర్స్ పరంగా రెండూ కూడా ఉత్తమంగా ఉంటాయి. మంచి పట్టుని అందించడానికి అనుకూలంగా ఉండే స్టీరింగ్ వీల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఏసీ వెంట్స్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టం, డ్రైవర్ డిస్ప్లే, అద్భుతమైన సీజింగ్ పొజిషన్, క్లైమేట్ కంట్రోల్ ఉంటాయి. వీటితో పాటు సేఫ్టీ ఫీచర్స్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. సేఫ్టీ విషయంలో మహీంద్రా థార్ 4 స్టార్ స్కోరింగ్ సొంతం చేసుకుని భారతదేశంలో అత్యంత సురక్షితమైన వాహనంగా నిలిచింది. కాగా జిమ్నీ కూడా మంది సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంది, అయితే సేఫ్టీ రేటింగ్ ఇంకా తెలియాల్సి ఉంది.
కలర్ ఆప్షన్
మహీంద్రా థార్ మొత్తం ఆరు కలర్ ఆప్షన్స్ పొందుతుంది. అవి న్యాపోలీ బ్లాక్, రెడ్ రేజ్, గెలాక్సీ గ్రే, ఆక్వా మెరైన్, ఎవరెస్ట్ వైట్, బ్లేజింగ్ బ్రాంజ్ కలర్స్. ఇక జిమ్నీ కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే.. ఇది మిడ్ నైట్ బ్లాక్ రూప్‌తో రెడ్ కలర్, బ్లూయిష్ బ్లాక్ రూప్‌తో రెడ్, బ్లూయిష్ బ్లాక్ రూప్‌తో కైనెటిక్ ఎల్లో, పెర్ల్ ఆర్కిటిక్ వైట్, గ్రానైట్ గ్రే, సిజ్లింగ్ రెడ్, బ్లూయిష్ బ్లాక్, నెక్సా బ్లూ కలర్స్ పొందుతుంది.
డైమెన్షన్
మారుతి జిమ్నీ కొలతల పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దీని పొడవు 3850 మిమీ, వెడల్పు 1645 మిమీ, ఎత్తు 1730 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 210 మిమీ, వీల్ బేస్ 2550 మిమీ వరకు ఉంటుంది. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.
మహీంద్రా థార్ పొడవు 3985 మిమీ, వెడల్పు 1820 మిమీ, ఎత్తు 1970 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 219 మిమీ, వీల్ బేస్ 2450 మిమీ వరకు ఉంటుంది. మహీంద్రా థార్ 3 డోర్స్ మోడల్ అయినప్పటికీ పరిమాణం పరంగా జిమ్నీ కంటే కొంత ఎక్కువగా ఉంటుంది.
ఇంజన్
మారుతి జిమ్నీ 5 డోర్ ఎస్‌యువి 1.5-లీటర్ K-సిరీస్ ఇంజన్ కలిగి మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సహాయంతో 102 bhp పవర్ 137 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. జిమ్నీ ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో వస్తుంది.
(ఇదీ చదవండి: వందల కోట్లు సామ్రాజ్యం సృష్టించిన కూలీ కొడుకు - ఎవరీ ముస్తఫా?)
మహీంద్రా థార్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇందులోని 2.0-లీటర్ టర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ 150 bhp పవర్ 300 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 6 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలు ఇందులో ఉంటాయి. పెట్రోల్ ఇంజిన్ లీటరుకు 15.2 కిమీ మైలేజ్ అందిస్తుంది. 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ 130 bhp పవర్ 300 Nm టార్క్ అందిస్తుంది. ఇందులో కూడా 6 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలు ఉంటాయి. డీజిల్ ఇంజిన్ కూడా లీటరుకు 15.2 కిమీ మైలేజ్ అందిస్తుంది.
(ఇదీ చదవండి: అప్పుచేసి ట్రక్కు కొని వేలకోట్లు సంపాదిస్తున్నాడిలా!)
ప్రాక్టికాలిటీ
మారుతి జిమ్నీ 5 డోర్స్ మోడల్ అయినప్పటికీ పరిమాణంలో మహీంద్రా థార్ కొంత పెద్దదిగా ఉంటుంది. రెండూ కూడా అద్భుతమైన డిజైన్, ఫీచర్స్ కలిగి పనితీరు పరంగా చాలా ఉత్తమంగా ఉంటాయి. కాగా ఇప్పటికే మార్కెట్లో మహీంద్రా థార్ సంచలన అమ్మకాలను పొందింది. జిమ్నీ కూడా విడుదలకు ముందే దాదాపు 30,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందింది. కావున జిమ్నీ కూడా తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము. మొత్తం మీద డిజైన్, ఫీచర్స్, కలర్ ఆప్షన్స్ మొదలైన విషయాల్లో దేనికదే సాటిగా ఉన్నాయి. కావున కొనుగోలుదారులు ఇవన్నీ బేరీజు వేసుకుని నచ్చిన మోడల్ కొనుగోలు చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment