బంగారం కొంటారా.. బ్యాంకుల్లో దాచుకుంటారా? | Majority prefer banks deposits for savings 21pc in gold says Survey | Sakshi
Sakshi News home page

బంగారం కొంటారా.. బ్యాంకుల్లో దాచుకుంటారా?

Published Thu, Dec 28 2023 1:09 PM | Last Updated on Thu, Dec 28 2023 1:10 PM

Majority prefer banks deposits for savings 21pc in gold says Survey - Sakshi

న్యూఢిల్లీ: భారతీయులు తమ ఆదాయాలను పరిరక్షించుకోడానికి ఏ మార్గాలను అన్వేషిస్తున్నారన్న అంశంపై మనీ9 నిర్వహించిన 2023 వార్షిక వ్యక్తిగత ఫైనాన్స్‌ పల్స్‌ సర్వే ఆసక్తికర అంశాలను వెలువరించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 77 శాతం మంది బ్యాంక్‌ డిపాజిట్లు ఇందుకు తగిన మార్గమని పేర్కొంటే, 21 శాతం మంది బంగారంపై పెట్టుబడి పెట్టాలని భావించారు.

బీమా రంగంపై కూడా సానుకూల ధోరణి నెలకొంది. గతేడాది కన్నా  27 శాతం మంది అధికంగా జీవిత బీమా పాలసీలవైపు మొగ్గుచూపారు. 2022 సర్వేలో ఇది 19 శాతమే కావడం గమనార్హం. దాదాపు 20 రాష్ట్రాల్లో 35,000కుపైగా కుటుంబాల నుంచి ఈ సర్వే జరిగింది. రిసెర్చ్‌ ట్రయాంగిల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఆర్‌టీఐ) ఇంటర్నేషనల్‌ సహకారంతో జరిగిన ఈ సర్వేలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. 

  • సర్వేలో పాల్గొన్నవారిలో 53 శాతం మంది ఇప్పటికీ ఆరోగ్య బీమా కవరేజ్‌ కలిగిఉండకపోవడం ఆందోళన కలిగించే అంశం.  
  • స్టాక్‌ మార్కెట్‌ కూడా క్రమంగా ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. 2022లో స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడిదారులు కేవలం 3 శాతం ఉంటే, 2023లో ఇది 9 శాతానికి ఎగసింది.  
  • మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులు కూడా ఇదే సమయంలో 6 శాతం నుంచి 10 శాతానికి ఎగశాయి.  
  • దక్షిణ భారత నగరాలైన బెంగళూరు (69 శాతం), తిరువనంతపురం (66 శాతం) బంగారం పొదుపులో అగ్రగామిగా ఉండడం గమనార్హం.  
  • బీమా వ్యాప్తిలో మదురై (84 శాతం) అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో అమరావతి (79 శాతం), ఔరంగాబాద్‌ (76 శాతం) ఉన్నాయి.  
  • విలాసవంతమైన జీవనశైలిని అనుభవిస్తున్న భారతీయ కుటుంబాల శాతం 2022లో 3 శాతం ఉండగా, 2023లో 5 శాతానికి పెరిగింది.  లగ్జరీ ప్రధానంగా మెట్రో నగరాల్లో కేంద్రీకృతమై ఉన్నప్పటికీ, ఈ ధోరణి దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement