ముంబై, సాక్షి: స్వల్ప ఆటుపోట్ల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 72 పాయింట్లు పెరిగి 46,079కు చేరగా.. నిఫ్టీ 18 పాయింట్లు బలపడి 13,484 వద్ద ట్రేడవుతోంది. సోమవారం నమోదైన భారీ పతనం నుంచి మార్కెట్లు తిరిగి మంగళవారం కోలుకున్న సంగతి తెలిసిందే. కాగా.. రూపు మార్చుకుని యూరోపియన్ దేశాలలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో మంగళవారం యూఎస్ మార్కెట్లు 0.5 శాతం స్థాయిలో బలహీనపడ్డాయి. ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుండటంతో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 46,191- 45,899 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 13,517-13,432 పాయింట్ల మధ్య ఊగిసలాటకు లోనైంది.
ప్రయివేట్ బ్యాంక్స్ డౌన్
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఐటీ, రియల్టీ రంగాలు 1.5 శాతం చొప్పున పుంజుకోగా.. మెటల్ 0.5 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, మారుతీ, ఎంఅండ్‌ఎం, టెక్ మహీంద్రా, నెస్లే, టీసీఎస్, టైటన్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్ 3-1 శాతం మధ్య ఎగశాయి. అయితే ఓఎన్‌జీసీ, దివీస్, ఆర్‌ఐఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ లైఫ్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఐవోసీ, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, యాక్సిస్, ఐసీఐసీఐ 1.6-0.3 శాతం మధ్య బలహీనపడ్డాయి.
గోద్రెజ్ ప్రాపర్టీస్ ప్లస్
డెరివేటివ్ స్టాక్స్‌లో గోద్రెజ్ ప్రాపర్టీస్, పిరమల్, జూబిలెంట్ ఫుడ్, ఎస్కార్ట్స్, పిడిలైట్, అశోక్ లేలాండ్, అపోలో హాస్పిటల్స్, మెక్‌డోవెల్, మ్యాక్స్ ఫైనాన్స్, టాటా పవర్ 4-1.4 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. పీఎన్‌బీ, అంబుజా, ఎన్‌ఎండీసీ, ఇండస్ టవర్, ఏసీసీ, జీ, ఐజీఎల్, జిందాల్ స్టీల్ 3-1 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6-1 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,428 లాభపడగా.. 487 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి.
ఎఫ్‌పీఐల పెట్టుబడులు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,153 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) దాదాపు రూ. 662 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 324 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టగా.. డీఐఐలు రూ. 486 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment