నష్టాలతో ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు చివరి గంటలో సాధించిన రికవరీతో ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ నామమాత్రంగా 12 పాయింట్లు క్షీణించి 38,129 వద్ద నిలవగా.. నిఫ్టీ 21 పాయింట్ల స్వల్ప నష్టంతో 11,194 వద్ద స్థిరపడింది. అమెరికా నుంచి ఆసియా వరకూ మార్కెట్లు బలహీనపడటంతో తొలి నుంచీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే ఆసక్తి చూపారు. దీంతో 37,949 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ 37,748 వరకూ నీరసించింది. చివర్లో 38,236 వరకూ పుంజుకుంది. ఇక నిఫ్టీ సైతం తొలుత 11,090 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకగా.. తదుపరి 11,225 వరకూ ఎగసింది.
మీడియా, ఆటో, ఫార్మా డీలా
ఎన్‌ఎస్‌ఈలో ఐటీ(1.4 శాతం) మాత్రమే లాభపడగా.. బ్యాంకింగ్, రియల్టీ, మీడియా, ఆటో, ఫార్మా 1.8-0.8 శాతం మధ్య వెనకడుగు వేశాయి. నిఫ్టీ దిగ్గజాలలో జీ, హిందాల్కో, యాక్సిస్, ఎస్‌బీఐ, గెయిల్, గ్రాసిమ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ, ఇన్‌ఫ్రాటెల్, టాటా మోటార్స్ 5-2.3 శాతం మధ్య నష్టపోయాయి. ఇతర బ్లూచిప్స్‌లో హెచ్‌సీఎల్ టెక్, ఆర్‌ఐఎల్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, ఇండస్‌ఇండ్, ఇన్ఫోసిస్, విప్రొ 4.7-1.3 శాతం మధ్య ఎగశాయి. రిలయన్స్ రిటైల్‌లో అమెజాన్ వాటా కొనుగోలు చేయనుందన్న అంచనాలతో ఆర్‌ఐఎల్ రూ. 2163 వద్ద సరికొత్త గరిష్టాన్ని చేరింది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 14 లక్షల కోట్లను అధిగమించింది. వెరసి దేశీయంగా లిస్టెడ్ కంపెనీల చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పింది.
ఫైనాన్స్ వీక్
డెరివేటివ్ కౌంటర్లలో చోళమండలం, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్, పెట్రోనెట్, ఉజ్జీవన్, బయోకాన్, ఎస్కార్ట్స్ 4.6-3.6 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే ఐడీఎఫ్‌సీ ఫస్ట్, నిట్ టెక్, ఆర్‌బీఎల్ బ్యాంక్, జీఎంఆర్, మారికో, అంబుజా సిమెంట్ 4.4-1.6 శాతం మధ్య ఎగశాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6-0.25 శాతం మధ్య డీలాపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1583 నష్టపోగా.. 1070 లాభపడ్డాయి.
ఎఫ్‌పీఐల పెట్టుబడులు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1740 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 932 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. బుధవారం సైతం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 1666 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1139 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment