మార్కెట్ల జోరు చూడతరమా..!! | Market ends at life time highs | Sakshi
Sakshi News home page

మార్కెట్ల జోరు చూడతరమా..!!

Published Wed, Nov 11 2020 4:03 PM | Last Updated on Wed, Nov 11 2020 4:07 PM

Market ends at life time highs - Sakshi

ముంబై: వరుసగా 8వ రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు దూకుడు చూపాయి. సెన్సెక్స్ 316 పాయింట్లు జంప్‌చేసి 43,594 వద్ద ముగిసింది. నిఫ్టీ 118 పాయింట్లు ఎగసి 12,749 వద్ద స్థిరపడింది. వెరసి ఇండెక్సులు మూడో రోజూ సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. అయితే మిడ్‌సెషన్‌కల్లా మార్కెట్లు లాభాలను పోగొట్టుకుని నష్టాలలోకి ప్రవేశించాయి. 8 రోజుల భారీ ర్యాలీ నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడం ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. తొలుత సెన్సెక్స్ 43,708 వరకూ దూసుకెళ్లింది. తదుపరి అమ్మకాలు తలెత్తడంతో 42,970 వరకూ వెనకడుగు వేసింది. అంటే గరిష్టం నుంచి దాదాపు 740 పాయింట్లు క్షీణించింది. ఇక నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 12,770- 12,571 మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. 

మెటల్స్‌ మెరుపులు
ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా, మెటల్‌ 3.5 శాతం చొప్పున జంప్‌చేయగా.. ఐటీ, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ1.6-0.8 శాతం మధ్య బలపడ్డాయి. పీఎస్‌యూ బ్యాంక్స్‌, మీడియా 0.5-0.3 శాతం నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో హిందాల్కో, టాటా స్టీల్‌ 8 శాతం స్థాయిలో పురోగమించాయి. ఈ బాటలో డాక్టర్‌ రెడ్డీస్‌, యాక్సిస్‌, ఐషర్‌, ఐటీసీ, బజాజ్‌ ఫిన్‌, హీరో మోటో, టాటా మోటార్స్‌, సిప్లా, గెయిల్‌, సన్‌ ఫార్మా, ఇన్ఫోసిస్‌, కొటక్‌ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బీపీసీఎల్‌, అల్ట్రాటెక్‌, దివీస్‌ 4.2-2.8 శాతం మధ్య ఎగశాయి. అయితే ఇండస్‌ఇండ్‌ 5.25 శాతం, ఆర్‌ఐఎల్‌ 4.2 శాతం చొప్పున పతనమయ్యాయి. ఇతర బ్లూచిప్స్‌లో టైటన్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బ్రిటానియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2-0.4 శాతం మధ్య డీలాపడ్డాయి.

అపోలో అప్
డెరివేటివ్ కౌంటర్లలో అపోలో హాస్పిటల్స్‌, అరబిందొ, ఐజీఎల్‌, లుపిన్‌, సెయిల్‌, లుపిన్‌, జూబిలెంట్‌ ఫుడ్‌, టొరంట్‌ ఫార్మా, ఆర్‌ఈసీ, అంబుజా, మదర్‌సన్‌ 8-3.3 శాతం మధ్య జంప్‌ చేశాయి. కాగా.. భారత్‌ ఫోర్జ్‌, ఎన్‌ఎండీసీ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌, హావెల్స్‌, బాటా, చోళమండలం, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, బీవోబీ 4-2.4 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.8-0.3 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,433 లాభపడగా.. 1,295 నష్టాలతో ముగిశాయి.

ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 5,627 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు. అయితే దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 2,309 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 4,548 కోట్లు ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 3,036  కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నెల తొలి వారంలో ఎఫ్‌పీఐలు ఏకంగా రూ. 13,399 కోట్ల పెట్టుబడులు కుమ్మరించడం గమనార్హం! అక్టోబర్‌లో రూ. 14,537 కోట్లు మాత్రమే ఇన్వెస్ట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement