ముంబై, సాక్షి: వరుసగా మూడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు రికార్డుల గెలాప్ తీశాయి. సెన్సెక్స్ 227 పాయింట్లు ఎగసి 44,180 వద్ద ముగిసింది. నిఫ్టీ 64 పాయింట్లు బలపడి 12,938 వద్ద నిలిచింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. ఇంట్రాడేలో మార్కెట్లు ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ 44,215 వద్ద గరిష్టానికి, 43,786 దిగువన కనిష్టానికీ చేరింది. నిఫ్టీ సైతం 12,949- 12,819 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. కోవిడ్-19 వ్యాక్సిన్లపై అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు తెలియజేశారు. దీంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే అత్యధికంగా ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొన్నారు. కాగా.. ఎన్‌ఎస్‌ఈలో మిడ్‌క్యాప్ ఇండెక్స్ 26 నెలల గరిష్టానికి చేరగా.. బ్యాంక్ నిఫ్టీ 9 నెలల హైను తాకింది.
మెటల్ ఓకే
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఆటో, రియల్టీ, బ్యాంకింగ్ రంగాలు 3-2 శాతం మధ్య ఎగశాయి. మీడియా, మెటల్ 0.5 శాతం పుంజుకోగా.. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఫార్మా 1 శాతం స్థాయిలో నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్, ఎల్‌అండ్‌టీ, ఇండస్‌ఇండ్, ఎస్‌బీఐ, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, ఐషర్, హిందాల్కో, ఐసీఐసీఐ, కొటక్ బ్యాంక్ 11-2 శాతం మధ్య జంప్ చేశాయి. అయితే బీపీసీఎల్, హెచ్‌యూఎల్, డాక్టర్ రెడ్డీస్, టైటన్, టీసీఎస్, ఐటీసీ, ఎయిర్‌టెల్, హీరో మోటో, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, విప్రో 3-1 శాతం మధ్య క్షీణించాయి.
ఫైనాన్స్ జోరు
డెరివేటివ్ కౌంటర్లలో ఎంఅండ్‌ఎం ఫైనాన్స్, శ్రీరామ్ ట్రాన్స్, ఫెడరల్ బ్యాంక్, ఎల్‌ఐసీ హౌసింగ్, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్, మదర్‌సన్, బాటా, టాటా పవర్, జీఎంఆర్, చోళమండలం, ఎంజీఎల్, ఇండిగో 7.6-4 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. మరోపక్క అంబుజా, అరబిందో, నాల్కో, ఐసీఐసీఐ లంబార్డ్, హెచ్‌పీసీఎల్, డాబర్, ఐడియా 2.5-1 శాతం మధ్య వెనకడుగు వేశాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం స్థాయిలో ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1,615 లాభపడగా.. 1,156 డీలా పడ్డాయి.
ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్‌మెంట్స్
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 4,905 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 3,829 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. సోమవారం మార్కెట్లకు సెలవుకాగా.. శనివారం ఎఫ్‌పీఐలు రూ. 78.5 కోట్లు, డీఐఐలు రూ. 20.3 కోట్లు కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. కాగా.. ఈ నెల 2-13 మధ్య కాలంలో ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్స్‌లో నికరంగా రూ. 29,436 కోట్లను ఇన్వెస్ట్ చేయడం విశేషం!
Comments
Please login to add a commentAdd a comment