పలు దేశాలలో మళ్లీ కోవిడ్-19 కేసులు ఉధృతమవుతున్న నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లకూ సెగ తగిలింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకే కట్టుబడటంతో సెన్సెక్స్ 173 పాయింట్లు క్షీణించి 39,750 వద్ద ముగిసింది. నిఫ్టీ 59 పాయింట్ల నష్టంతో 11,671 వద్ద స్థిరపడింది. బ్రిటన్ బాటలో తాజాగా జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాలు లాక్‌డవున్ ఆంక్షలు విధించడంతో బుధవారం అమెరికా, యూరోపియన్ మార్కెట్లు పతనమయ్యాయి. దీంతో తొలుత దేశీయంగానూ అమ్మకాలు వెల్లువెత్తాయి. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్ 39,524వరకూ పతనమైంది. అయితే ఒక దశలో 40,010 వరకూ పుంజుకోవడం గమనార్హం! ఇదే విధంగా తొలుత నిఫ్టీ 11,607 దిగువకు చేరింది. తదుపరి 11,744 వరకూ ఎగసింది. అక్టోబర్ డెరివేటివ్ సిరీస్ గడువు ముగియడంతో ట్రేడర్లు పొజిషన్లను రోలోవర్ చేసుకున్నారని, దీంతో కొంతమేర మార్కెట్లలో ఆటుపోట్లు సహజమని విశ్లేషకులు పేర్కొన్నారు.
అన్ని రంగాలూ
ఎన్‌ఎస్‌ఈలో ఐటీ మాత్రమే అదికూడా 0.3 శాతం బలపడగా.. మిగిలిన అన్ని రంగాలూ 2-0.5 శాతం మధ్య డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎల్‌అండ్‌టీ, టైటన్, అదానీ పోర్ట్స్, ఓఎన్‌జీసీ, యాక్సిస్, ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్, హెచ్‌యూఎల్, హీరో మోటో, ఎన్‌టీపీసీ 5-2 శాతం మధ్య బోర్లా పడ్డాయి. అయితే ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్, శ్రీ సిమెంట్, హెచ్‌సీఎల్ టెక్, కొటక్ బ్యాంక్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, ఐవోసీ, గెయిల్ 3-1 శాతం మధ్య పుంజుకున్నాయి.
పిరమల్ డౌన్
డెరివేటివ్స్‌లో పిరమల్, ఐడియా, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్, భెల్, ఎల్‌ఐసీ హౌసింగ్, డీఎల్‌ఎఫ్, సెయిల్, పీవీఆర్, ఫెడరల్ బ్యాంక్, గ్లెన్‌మార్క్, లుపిన్ 5.5-2 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోవైపు పిడిలైట్, హెచ్‌పీసీఎల్, బెర్జర్ పెయింట్స్, అదానీ ఎంటర్, ఇండిగో, ముత్తూట్, చోళమండలం, రామ్‌కో సిమెంట్, జూబిలెంట్ ఫుడ్ 5-2 శాతం మధ్య జంప్‌చేశాయి. బీఎస్‌ఈలో స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం నీరసించింది. ట్రేడైన షేర్లలో 1,561 నష్టపోగా.. 1,029 లాభపడ్డాయి.
ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,131 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే దేశీ ఫండ్స్(డీఐఐలు) సైలంట్ అయ్యాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 3,515 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1,571 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 119.4 కోట్లు, డీఐఐలు రూ. 979 కోట్లు చొప్పున అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే
Comments
Please login to add a commentAdd a comment