
జులై ఎఫ్‌అండ్‌వో సిరీస్ చివరి రోజు దేశీ స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. సెన్సెక్స్ 335 పాయింట్లు పతనమై 37,736వద్ద ముగిసింది. వెరసి 38,000 పాయింట్ల మార్క్ దిగువకు చేరింది. నిఫ్టీ సైతం 101 పాయింట్లు కోల్పోయి 11,102 వద్ద స్థిరపడింది. ఆర్థిక వ్యవస్థకు అన్నిరకాలుగా అండగా నిలవనున్నట్లు ఫెడరల్ రిజర్వ్ హామీ ఇవ్వడంతో బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. ఈ నేపథ్యంలో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి యథాప్రకారం అమ్మకాల ఒత్తిడిలో పడ్డాయి. ట్రేడర్లు పొజిషన్లను ఆగస్ట్ సిరీస్‌కు రోలోవర్ చేసుకునే బాటలో మార్కెట్లు ఆటుపోట్లను చవిచూసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో సెన్సెక్స్ 38,414 వద్ద గరిష్టాన్ని తాకగా.. 37,678 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. నిఫ్టీ 11,300- 11,085 పాయింట్ల మధ్య ఊగిసలాడింది.
మీడియా బోర్లా
ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్ నిఫ్టీ, మీడియా 2 శాతం స్థాయిలో బోర్లా పడగా.. మెటల్ 1.2 శాతం, ఆటో 0.6 శాతం చొప్పున నీరసించాయి. అయితే ఫార్మా 3 శాతం ఎగసింది. ఐటీ 0.7 శాతం పుంజుకుంది. నిఫ్టీ దిగ్గజాలలో డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, విప్రో, వేదాంతా, మారుతీ, ఇన్ఫోసిస్, సిప్లా, బ్రిటానియా 5-0.5 శాతం మధ్య లాభపడ్డాయి. మరోపక్క బీపీసీఎల్, ఇండస్‌ఇండ్, ఐవోసీ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, ఎయిర్‌టెల్, పవర్‌గ్రిడ్, టాటా మోటార్స్, ఓఎన్‌జీసీ, గ్రాసిమ్, ఎస్‌బీఐ, బజాజ్ ఫిన్, గెయిల్ 8-2 శాతం మధ్య పతనమయ్యాయి.
ఫైనాన్స్ వీక్
డెరివేటివ్స్‌లో దివీస్, అపోలో హాస్పిటల్స్, జూబిలెండ్ ఫుడ్, నిట్ టెక్, గ్లెన్‌మార్క్, ఎస్‌బీఐ లైఫ్, లుపిన్, ఇండిగో, అమరరాజా 6-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మణప్పురం, ఐబీ హౌసింగ్, శ్రీరామ్ ట్రాన్స్, పీవీఆర్, ఎస్‌ఆర్‌ఎఫ్, ఆర్‌బీఎల్, ఉజ్జీవన్, పిరమల్, భెల్, ఈక్విటాస్ 10-4 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.7 శాతం చొప్పున క్షీణించాయి. ట్రేడైన షేర్లలో 1584 నష్టపోగా.. 1060 మాత్రమే లాభపడ్డాయి.
అమ్మకాలవైపు..
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 353 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 506 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 246 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1017 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment