తొలుత అటూఇటుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి పతనంతో ముగిశాయి. సెన్సెక్స్ 600 పాయింట్లు కోల్పోయి 39,922 వద్ద నిలవగా.. నిఫ్టీ 160 పాయింట్ల నష్టంతో 11,729 వద్ద స్థిరపడింది. అమెరికా, యూరోపియన్ దేశాలలో కోవిడ్-19 కేసులు పెరగుతుండటం, యూఎస్ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ప్రతిపాదించిన ప్యాకేజీపై అనిశ్చితి, దేశీయంగా డెరివేటివ్ సిరీస్ ముగింపు వంటి అంశాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో తొలుత 40,664 వద్ద గరిష్టానికి చేరిన సెన్సెక్స్ తదుపరి 39,775 దిగువన కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ సైతం 11,929 పాయింట్ల ఇంట్రాడే గరిష్టం నుంచి ఒక దశలో 11,685 దిగువకు జారింది.
ఆటో అక్కడక్కడే
ఎన్‌ఎస్‌ఈలో ప్రధాన రంగాలన్నీ 2-1 శాతం మధ్య క్షీణించగా.. ఆటో నామమాత్ర నష్టంతో ముగిసింది. బ్యాంకింగ్, రియల్టీ, ఫార్మా, మెటల్ 2 శాతం స్థాయిలో బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్, ఐసీఐసీఐ, డాక్టర్ రెడ్డీస్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, హిందాల్కో, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్, శ్రీ సిమెంట్, కొటక్ బ్యాంక్ 3.5-2 శాతం మధ్య క్షీణించాయి. బ్లూచిప్స్‌లో కేవలం ఎయిర్‌టెల్, యూపీఎల్, ఎంఅండ్‌ఎం, ఐషర్, హీరో మోటో, ఎల్‌అండ్‌టీ 3.4-0.4 శాతం మధ్య పుంజుకున్నాయి.
అమరరాజా వీక్
డెరివేటివ్స్‌లో అమరరాజా, డీఎల్‌ఎఫ్, మైండ్‌ట్రీ, అపోలో టైర్, శ్రీరామ్ ట్రాన్స్, ఐబీ హౌసింగ్, ఫెడరల్ బ్యాంక్, ఏసీసీ 6-3.3 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే మరోపక్క వేదాంతా, ఆర్‌బీఎల్ బ్యాంక్, మారికో, సీమెన్స్, మ్యాక్స్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ 3-1.2 శాతం మధ్య ఎగశాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1-0.7 శాతం చొప్పున డీలా పడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,631 నష్టపోగా.. 1002 లాభాలతో ముగిశాయి.
ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్‌మెంట్స్
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 3,515 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,571 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 119.4 కోట్లు, డీఐఐలు రూ. 979 కోట్లు చొప్పున అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment