పెరుగుతున్న పెట్రోలు ధరలతో ప్రజలు అల్లాడిపోతున్న వేళ చల్లని కబురు చెప్పింది మారుతి సూజుకి ఇండియా. డీజిల్ కారుని మించి మైలేజీ అందించే కొత్త కారుని మార్కెట్‌లోకి తేబోతున్నట్టు ప్రకటించింది.
ఎంట్రీ లెవల్ హచ్‌బ్యాక్ మోడల్‌గా ఉన్న సెలెరియో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ని మార్కెట్‌లోకి తెచ్చేందుకు మారుతి రెడీ అయ్యింది. నవంబరు 10 నుంచి ఈ కొత్త సెలెరియో మోడల్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అవుతున్నాయి. రూ.11,000 చెల్లించి ఈ కారుని బుక్ చేసుకోవచ్చు. అయితే బుకింగ్స్‌కి ముందు అదిరిపోయే న్యూస్ చెప్పింది మారుతి.
కొత్త సెలెరియో కారు రికార్ఢు స్థాయిలో లీటరు పెట్రోలుకు 26 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందంటూ సంచలన ప్రకటన చేసింది. ఇండియాలోనే అత్యధిక మైలేజీ ఇచ్చే పెట్రోలు కారు తమదేనంటూ తేల్చి చెప్పింది. ఇప్పటి వరకు మారుతి స్విఫ్ట్, బాలెనో కార్లు 24 కి.మీల మైలేజీ ఇస్తున్నాయి. ప్రస్తుతం వీటినే అత్యధిక మైలేజీ ఇచ్చేవిగా పరిగణిస్తున్నాను. సెలెరియో వాటిని బీట్ చేయబోతుంది.
సెలెరియో కారులో 1 లీటరు కే 10సీ డ్యూయల్ జెట్ వీవీటీ పెట్రోలు ఇంజన్‌ను అమర్చారు. ఆటోమేటిక్, మాన్యువల్ గేర్లలో ఈ కారు లభించనుంది. ఈ ఫేస్ లిఫ్ట్ వెర్షన్‌లో ఏడు వేరియంట్లు మార్కెట్‌లోకి రాబోతున్నాయి. టచ్ స్క్రీన్ ఇన్ఫోంటైన్‌మెంట్, యాపిల్ కార్‌ప్లే వంటి లేటెస్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
సెలెరియా పెట్రోలు కారు ఎక్స్‌షోరూం కనిష్ట ధర రూ.4.50 లక్షల దగ్గర ప్రారంభం అవుతుండగా హైఎండ్ వేరియంట్ ధర రూ.6.00 లక్షలుగా ఉంది. కీలక సమయంలో మైలేజీ కారును మార్కెట్‌లోకి తెస్తూ హ్యుందాయ్ సాంట్రో, టాటా టియాగోలకు గట్టి సవాల్ విసిరింది మారుతి.
Comments
Please login to add a commentAdd a comment