2023 జనవరి ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో అందరి దృష్టిని ఆకర్శించిన 'మారుతి సుజుకి 5 డోర్స్ జిమ్నీ' (Maruti Suzuki Jimny) లాంచ్ డేట్ ఎట్టకేలకు ఖరారైంది. ఇప్పటికే 30,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందిన ఈ SUV విడుదల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న వాహన ప్రియులకు ఇది శుభవార్త అనే చెప్పాలి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
లాంచ్ డేట్
మారుతి సుజుకి దేశీయ విఫణిలో జిమ్నీ ధరలను అధికారికంగా జూన్ 07న ప్రకటించనుంది. ఈ కారు జీటా, ఆల్ఫా అనే రెండు వేరియంట్లలో విడుదలకానున్నట్లు సమాచారం. ఇందులో టాప్-స్పెక్ ఆల్ఫా ట్రిమ్‌కు ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు, దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ వేరియంట్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కూడా తెలుస్తోంది.
మారుతి జిమ్నీ బ్లూయిష్ బ్లాక్, కైనెటిక్ ఎల్లో, పెర్ల్ ఆర్కిటిక్ వైట్ అనే మూడు కలర్ ఆప్షన్స్‌లో లభించనుంది. ఇప్పటికే కంపెనీ ఈ ఆఫ్-రోడర్ మైలేజ్ గణాంకాలను కూడా వెల్లడించింది. 105 hp పవర్, 134.2 Nm టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.5 లీటర్ కె15బి ఇంజిన్ కలిగిన ఈ ఎస్‌యువి 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది.
మైలేజ్ డీటైల్స్
మాన్యువల్ గేర్‌బాక్స్ కలిగిన జిమ్నీ 5 డోర్ వెర్షన్ 16.94 కిమీ/లీటర్ మైలేజ్ అందించగా.. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వెర్షన్ 16.39 కిమీ/లీటర్ మైలేజ్ అందిస్తుందని తెలుస్తోంది. 40 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగిన జిమ్నీ మాన్యువల్ ఒక ఫుల్ ట్యాంక్‌తో 678 కిమీ రేంజ్, ఆటోమేటిక్ వెర్షన్ 656 కిమీ పరిధిని అందిస్తుంది. అయితే ఈ గణాంకాలు వాస్తవ ప్రపంచంలో కొంత భిన్నంగా ఉండే అవకాశం ఉంటుంది.
(ఇదీ చదవండి: 5 డోర్స్ జిమ్నీ మైలేజ్ వెల్లడించిన మారుతి సుజుకి - పూర్తి వివరాలు)
ఫీచర్స్ విషయానికి వస్తే 5 డోర్స్ జిమ్నీ 9-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఏసీ వెంట్స్, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే మొదలైన ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. అంతే కాకుండా ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డీసెంట్ కంట్రోల్, రియర్ వ్యూ కెమరా వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇందులో లభిస్తాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి. డిజైన్ పరంగా జిమ్నీ చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది.
అంచనా ధరలు
జిమ్నీ ధరలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు, కానీ ఇది రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షలఎక్స్ -షోరూమ్ ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. ఈ ఆఫ్-రోడర్ దేశీయ మార్కెట్లో విడుదలైన తర్వాత మహీంద్రా థార్, ఫోర్స్ గుర్ఖా వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా వ్యవహరించనుంది. జిమ్నీ గురించి ఎప్పటికప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి.
Comments
Please login to add a commentAdd a comment