పండుగ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లో వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. టాటా మోటార్స్ 30 రోజుల్లో లక్ష కార్లను విక్రయించి రికార్డ్ సృష్టించగా.. మారుతి సుజుకి కంపెనీకి చెందిన జిమ్నీ 5 డోర్ మోడల్.. లాంచ్ అయినప్పటి నుంచి లక్ష యూనిట్ల మైలురాయిని ఛేదించింది.
భారతదేశంలో తయారైన మారుతి సుజుకి జిమ్నీ 5 డోర్ ఎస్యూవీ.. 100 దేశాలకు ఎగుమతి అవుతోంది. 2023 నుంచి ఈ కారు జపాన్, మెక్సికో, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, చిలీ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో అమ్ముడవుతూ ఉంది. అంతే కాకుండా.. ఈ ఏడాది ప్రారంభంలో జపాన్ మార్కెట్లో జిమ్నీ నోమేడ్ పేరుతో లాంచ్ అయింది. ఇది అక్కడ కూడా ఉత్తమ అమ్మకాలు పొందుతూ.. 50వేలకంటే ఎక్కువ యూనిట్ల అమ్మకాలను ఛేదించింది. ఫ్రాంక్స్ క్రాస్ఓవర్ తర్వాత జిమ్నీ 5-డోర్ ఇప్పుడు మారుతి సుజుకి ఎక్కువగా ఎగుమతి చేస్తున్న రెండవ వాహనంగా మారింది.
మారుతి సుజుకి జిమ్నీ.. ల్యాడర్ ఫ్రేమ్ ఛాసిస్ ఆధారంగా రూపొందించబడి.. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కు జతచేయబడి అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.
ఇదీ చదవండి: పేరులో జీరో.. పనితీరులో హీరో: సరికొత్త సోలార్ కారు
మారుతి సుజుకి మొత్తం మీద 16 కార్లను అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తోంది. ఇందులో జిమ్నీ మోడల్ ఎక్కువ మంది ఆకట్టుకోవడంలో విజయం సాధించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన ఎగుమతులు, అంతకుముందు ఏడాదితో పిలిస్తే కొంత ఎక్కువే అని తెలుస్తోంది.


