హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ సంస్థ మీషోలో విక్రేతల సంఖ్య 11 లక్షల పైచిలుకు చేరింది. కార్యకలాపాలు ప్రారంభించిన ఎనిమిదేళ్లలోనే అత్యంత వేగంగా 1 మిలియన్ (10 లక్షల) విక్రేతల మైలురాయిని అధిగమించినట్లు సంస్థ డైరెక్టర్ ఉత్కర్‡్ష గర్గ్ గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. వీరిలో 80 శాతం మంది ఆన్‌లైన్‌లో తొలిసారిగా విక్రయిస్తున్నవారేనని చెప్పారు. తెలంగాణ నుంచి దాదాపు 17,000 పైచిలుకు చిన్న వ్యాపార సంస్థలు ఉన్నాయని గర్గ్ తెలిపారు. సున్నా కమీషన్ విధానాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో గతేడాది రాష్ట్రం నుంచి తమ ప్లాట్‌ఫాంలో విక్రేతల సంఖ్య 20 శాతం పెరిగిందని చెప్పారు.
ప్రాంతీయంగా హోమ్..కిచెన్, వ్యక్తిగత సౌందర్య సంరక్షణ, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ ఉత్పత్తులకు డిమాండ్ ఉంటోందని గర్గ్ తెలిపారు. మీషోలో సెల్లర్ల వ్యాపారం గత రెండేళ్లలో 82 శాతం పెరిగినట్లు గర్గ్ వివరించారు. గతేడాది తాము 91 కోట్ల ఆర్డర్లను ప్రాసెస్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 50 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ ఈ–కామర్స్ రంగం 2030 నాటికి ఆరు రెట్లు పెరిగి 300 బిలియన్ డాలర్లకు చేరగలదని అంచనాలు ఉన్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు (ఎస్‌ఎంబీ) అవకాశాలను అందిపుచ్చుకోవడంలో తోడ్పాటునివ్వడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు గర్గ్ తెలిపారు. తమ విక్రేతల్లో 50 శాతం మంది రాజ్‌కోట్, హుబ్లి తదితర ద్వితీయ శ్రేణి పట్టణాల నుంచి ఉంటున్నారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment