ఆర్డర్లలో 35 శాతం వృద్ధి
బలంగా వినియోగ సెంటిమెంట్
చిన్న పట్టణాల్లోనూ ఈ కామర్స్‌కు ఆదరణ
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సంస్థ ‘మీషో’ ఈ ఏడాది ఆర్డర్లలో 35 శాతం వృద్ధిని సాధించినట్టు ప్రకటించింది. తమ ప్లాట్‌ఫామ్‌లపై వినియోగదారులు (యూజర్లు) 25 శాతం పెరిగి 17.5 కోట్లకు చేరినట్టు తెలిపింది. వినియోగం పుంజుకోవడం, టైర్–2 నగరాలు, చిన్న పట్టణాల్లో ఈ–కామర్స్ సేవలను వినియోగించుకునే వారు పెరగడం సౌందర్య, వ్యక్తిగత రక్షణ (బీపీసీ), హోమ్, కిచెన్ విభాగాల్లో వార్షికంగా ఆర్డర్లు 70 శాతం పెరగడం వృద్ధికి సాయపడినట్టు పేర్కొంది.
‘‘మొత్తం ఆర్డర్లు వార్షికంగా 35 శాతం పెరగడం అన్నది బలమైన వినియోగ సెంటిమెంట్‌కు నిదర్శనం. దేశవ్యాప్తంగా ఈ–కామర్స్ వినియోగం శరవేగంగా విస్తరిస్తోంది. పెడుతున్న వ్యయానికి తగిన విలువ కోరుకునే కస్టమర్లతో ఈ వృద్ధి సాధ్యమవుతోంది. ఫ్యాషన్, బ్యూటీ, పర్సనల్ కేర్, గృహోపకరణాల్లో అందుబాటు ధరల్లో ఉత్పత్తులను వారు కోరుకుంటున్నారు’’అని మీషో తన ప్రకటనలో వివరించింది.
ఎన్నో సవాళ్లతో కూడిన పరిస్థితుల్లోనూ వృద్ధి పథాన్ని కొనసాగించామని, లావాదేవీలు నిర్వహించే యాక్టివ్ యూజర్ల సంఖ్య 17.5 కోట్లకు పెరిగినట్టు వెల్లడించింది. 2023 చివరికి సంస్థ యూజర్లు 14 కోట్లుగా ఉన్నారు. నాయుడుపేట (ఆంధ్రప్రదేశ్), షేర్గటి (బీహార్), హర్పణహల్లి (కర్ణాటక) తదితర టైర్–4, అంతకంటే చిన్న పట్టణాల నుంచే సగం యూజర్లు ఉన్నట్టు మీషో తెలిపింది. 21 కోట్ల డౌన్‌లోడ్‌లతో వరుసగా నాలుగో ఏడాది ఎక్కువ మంది డౌన్‌లోడ్ చేసుకున్న షాపింగ్ యాప్‌గా తమ స్థానాన్ని కాపాడుకున్నట్టు పేర్కొంది.
ఒక వంతు జెన్ జెడ్ నుంచే..
తమ మొత్తం యూజర్లలో మూడింత ఒక వంతు మంది జెనరేషన్ జెడ్ (1996–2009 మధ్య జన్మించిన వారు) వారేనని మీషో తెలిపింది. కార్యకలాపాల ఆదాయం 33 శాతం వృద్ధితో రూ.7,615 కోట్లకు చేరిందని వెల్లడించింది. ప్రస్తుత యూజర్ల నుంచి ఆర్డర్లకుతోడు, యాక్టివ్ యూజర్ల పెరుగుదల ఇందుకు అనుకూలించినట్టు వివరించింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.232 కోట్ల ఆపరేటింగ్ క్యాష్‌ఫ్లో సాధించిన మొదటి ఈ–కామర్స్ సంస్థ మీషో అని తెలిపింది. మీషో మాల్‌పై ప్రముఖ బ్రాండ్లు అయిన లోటస్ ఆరు రెట్లు, జోయ్ 5.5 రెట్లు, రెనీ 3.5 రెట్లు, డాలర్ 1.8 రెట్లు చొప్పున వృద్ధి సాధించినట్టు పేర్కొంది. 2024లో 2.2 కోట్ల మోసపూరిత లావాదేవీలను నివారించినట్టు మీషో తెలిపింది. 77 లక్షల స్కామ్ దాడులను అడ్డుకున్నట్టు వివరించింది. శాంతి భద్రతల ఏజెన్సీల సహకారంతో మోసాలను నివారించడంలో 98 శాతం మేర విజియం సాధించినట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment