ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా (Meta Platforms Inc) ఆఖరు రౌండ్ లేఆఫ్స్‌ను మొదలు పెట్టింది. మొత్తం 10,000 ఉద్యోగాలను తొలగించడానికి మార్చిలో ప్రకటించిన ప్రణాళికలో భాగంగా ఇది చివరి రౌండ్ తొలగింపు. మొదటి, రెండో విడత తొలగింపులు ఇప్పటకే పూర్తయ్యాయి.
ఈ మేరకు కొంతమంది మెటా ఉద్యోగులు లింక్డ్‌ఇన్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో తమ తొలగింపు గురించి తెలియజేశారు. ఈ రౌండ్ లేఆఫ్స్‌లో కంపెనీ యాడ్ సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో ఎక్కువ మందిని తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.
సీవెరెన్స్ ప్యాకేజీ అంటే?
గతంలో 11,000 మంది ఉద్యోగులను తొలగించినప్పుడు మెటా కంపెనీ వారికి సీవెరెన్స్ ప్యాకేజీని వాగ్దానం చేసింది. సీవెరెన్స్ ప్యాకేజీ అంటే ఉద్యోగులను తొలగించినప్పుడు కంపెనీ వారికి చెల్లించే మొత్తానికి సంబంధించిన ప్యాకేజీ. ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఈ ప్యాకేజీ కింద 16 వారాల మూల వేతనం చెల్లిస్తారు. అదనంగా ఉద్యోగుల అనుభవాన్ని బట్టి వారు పనిచేసిన ఒక్కో సంవత్సరానికి రెండు వారాల మూల వేతనం చొప్పున తొలగింపునకు గురైన ఉద్యోగులు అందుకుంటారు. అలాగే ఈ ప్యాకేజీ కింద ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఆరు నెలలపాటు వైద్య ఖర్చులను కంపెనీనే భరిస్తుంది.
2022 నవంబర్‌లో 11,000 మందికిపైగా ఉద్యోగులను మెటా తొలగించింది. తర్వాత ఈ ఏడాది మార్చిలో మళ్లీ 10,000 ఉద్యోగాలను తొలగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ సారి తొలగిస్తున్న ఉద్యోగాలతో కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 2021 ఏడాది మధ్య నాటికి ఉన్న స్థాయికి పడిపోయింది. 2020 తర్వాత మెటా నియామకాలను రెట్టింపు చేస్తూ వచ్చింది.
మొత్తంగా లేఆఫ్స్ ప్రభావం ఈ సారి నాన్-ఇంజనీరింగ్ ఉద్యోగులపై పడింది. అంటే కోడింగ్, ప్రోగ్రామింగ్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కంపెనీ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీతో ఇంజనీర్లు, నాన్ ఇంజనీరింగ్ ఉద్యోగుల మధ్య సమతూకం పాటించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ గత మార్చిలో హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ భారీ కానుక.. రూ.64 కోట్లు!
Comments
Please login to add a commentAdd a comment