న్యూఢిల్లీ: భారత్‌లో తమ వ్యాపార విభాగాన్ని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్‌ఆర్‌వీఎల్)కు విక్రయించే ఒప్పంద ప్రక్రియ పూర్తయినట్లు జర్మనీ రిటైల్ సంస్థ మెట్రో తెలిపింది. ఈ డీల్ కింద 31 హోల్‌సేల్ స్టోర్లు, మొత్తం రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియో ఉన్నట్లు వివరించింది.
వ్యాపార బదిలీ ప్రక్రియ జరిగే సమయంలో మెట్రో ఇండియా స్టోర్లన్నీ అదే బ్రాండ్‌తో కొనసాగుతాయని, ఉద్యోగులు.. కస్టమర్ల విషయంలో పెద్ద మార్పులేమీ ఉండబోవని సంస్థ పేర్కొంది. భారత్‌లో మెట్రో కార్యకలాపాలను రూ. 2,850 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు ఆర్‌ఆర్‌వీఎల్ గతేడాది డిసెంబర్ 22న ప్రకటించింది.
ఇప్పటికే భారీగా కార్యకలాపాలు విస్తరిస్తున్న ఆర్‌ఆర్‌వీఎల్.. తాజాగా మెట్రో కొనుగోలుతో దేశీయంగా రిటైల్ రంగంలో మరింత పట్టు సాధించనుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌ఆర్‌వీఎల్ రూ. 2.30 లక్షల కోట్ల ఆదాయం ఆర్జించింది. అటు మెట్రో ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో 29.8 బిలియన్ యూరోల అమ్మకాలు నమోదు చేసింది.
మెట్రో కొనుగోలుతో..
ఇప్పటికే రిలయన్స్ జియో మార్ట్, రిలయన్స్ ట్రెండ్స్, స్మార్ట్ బజార్ పేర్లతో ఇప్పటికే రిటైల్ మార్కెట్‌లో ఉన్న రిలయన్స్ రిటైల్.. మెట్రో ఇండియా కొనుగోలుతో తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు దోహదపడనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు అంచనా. కాగా, మెట్రో కొనుగోలులో రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ ఇషా అంబానీ చక్రం తిప్పినట్లు తెలుస్తోంది.
రిలయన్స్‌కు మూలస్తంభాల్లా..
రిలయన్స్ సామ్రాజ్యానికి ముగ్గురు వారసులు మూలస్తంభాల్లా నిలుస్తున్నారు. తండ్రి నుంచి పుణికి పుచ్చుకున్న వ్యాపార వారసత్వాన్ని తమదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఇక, గత ఏడాది రిలయన్స్ రిటైల్ బాధ్యతలు తన కూతురు ఇషా అంబానీకి,రిలయన్స్ జియో బాధ్యతలు తన పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీకి,సోలార్ ఎనర్జీకి సంబంధించిన విభాగం మరో కుమారుడు అనంత్ అంబానీకి ముఖేష్ అంబానీ దంపతులు అప్పగించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment